సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి వినియోగదారులు సకల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్‌హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీటి మీటర్ల రీడర్ల పనితీరు కలవరపెడుతున్నది. మెకానికల్ మీటర్ రీడర్లు చెడిపోవడంతో.. జలమండలి సిబ్బంది యావరేజి పేరిట పెద్దఎత్తున బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆటోమేటెడ్ మీటర్ల పనితీరు వినియోగదారులను కలవర పెడుతున్నది.
నీళ్లు రాకున్నా రీడింగ్ తిరుగుతూ లక్షలాది రూపాయల బిల్లులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చాలాచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా మీటర్ రీడర్ ఏజెన్సీలు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీ సిబ్బంది మీటర్లు బిగించడం వరకే పరిమితమవుతున్నారని.. రిపేర్లు వచ్చినా చేయడానికి రావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్లలో వేలాది రూపాయలతో ఏర్పాటు చేసుకున్న మీటర్లు సరిగ్గా పనిచేయకపోవడం.. నీళ్లు రాకున్నా రీడింగ్ చూపించడంతో లక్షలాది బిల్లులు చెల్లించాల్సి వస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
మాసబ్ ట్యాంక్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌కు ఆటోమేటెడ్ మీటర్ రీడర్ బిగించుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 20వేల లీటర్ల నీళ్లు సరిపోతుండటంతో ఇంతకాలం ఆ అపార్ట్మెంట్ వాసులకు బిల్లు కట్టాల్సిన పరిస్థితి రాలేదు. కానీ గత కొద్ది రోజులుగా నెలకు రూ.లక్షకు పైగానే బిల్లు వస్తున్నది. ఉచితంగా వచ్చే నీళ్లే సరిపోయే అపార్ట్‌మెంట్‌కు ఏకంగా లక్ష రూపాయలకు పైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యారు.
మీటర్ రీడర్‌ను పరిశీలిస్తే నీళ్లు రాకున్నా రీడింగ్ తిరుగుతూనే ఉంది. రోజంతా తిరుగుతుండటంతో బిల్లు పెరిగిపోతున్నది. ఇదే పరిస్థితి నగరంలోని చాలాచోట్ల ఉంది. దీంతో బాధితులు జలమండలి ప్రధాన కార్యాలయానికి వరుస కడుతున్నారు. మీటర్ రీడర్ ఏజెన్సీలు మరమ్మతులకు రాకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నీటిని వాడుకోకున్నా లక్షలాది రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలున్న ప్రాంతాల్లో మీటర్ రీడర్ ఏజెన్సీలను అలర్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.