సిటీబ్యూరో, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ)/మణికొండ: వేసవిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ కార్యాలయానికే పరిమితమవుతున్నారంటూ ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం ఉదయమే సీఎండీ తనతో పాటు డైరెక్టర్లు శివాజీ, చక్రపాణిలతో కలిసి పుప్పాలగూడ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. వేసవిలో ఏప్రిల్ నెలలోనే మే నెల డిమాండ్ వస్తుండడం ప్రత్యేకించి 100 మిలియన్‌యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండడంతో సబ్స్టేషన్లపై అధికలోడ్ పడుతున్నదని క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు చెబుతున్నప్పటికీ కార్పొరేట్ కార్యాలయం నుంచి సరైన స్పందన లేదు.
ఈ విషయంతో పాటు మొత్తం చాట్‌జీపీటీతోనే ఏఐ సహకారంతో పాలన సాగిస్తున్నారంటూ నమస్తే కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో పుప్పాలగూడ సబ్‌స్టేషన్‌లో ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఉద్యోగులతో పాటు కొందరు వినియోగదారులతో సీఎండీ మాట్లాడారు. ఓఅండ్ఎం ఉద్యోగులు మెటీరియల్ లేక ఇబ్బందులు పడుతున్నామని, ఒకవేళ ఇచ్చినా నాసిరకం సామగ్రి ఇస్తున్నారని చెప్పారు. సీఎండీ జితేశ్ మాట్లాడుతూ మెటీరియల్ కొరత తీరాలంటే ప్రతీ సెక్షన్లో ఒక బీరువా ఏర్పాటు చేసి అందులో వస్తు సామగ్రిని భద్రపరుచుకోవాలని సూచించారు. సిబ్బందికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కాలనీలో విద్యుత్ సమస్యలపై వినతిపత్రం స్వీకరించారు. ఏఐ ఆధారంగా పనులు చేస్తామని, అవసరమైన చోట ఏఐని వాడుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎండీ జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
ఆ ఫిర్యాదులు నిజం కాదు..!
సోషల్‌మీడియాలో వస్తున్న ఫిర్యాదులు నిజమైనవి కాదని, కొందరు కావాలని తమ ప్రాంతాల్లో కరెంట్ పోతున్నదంటున్నారే తప్ప..నగరంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవని డిస్కం ఉన్నతాధికారులు చెప్పుకొంటున్నారు. అప్రకటిత కరెంట్ కోతలతో నగరం మాత్రమే కాకుండా టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ ఇబ్బందులు పడుతుంటే దక్షిణ డిస్కంకు చెందిన కీలక డైరెక్టర్లకు మాత్రం అసలు కరెంట్ కోతలే లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మింట్‌కాంపౌండ్‌లో చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా ఎస్పీడీసీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రతీరోజు తమ ప్రాంతాల్లో కరెంట్ పోయిందంటూ వందల కొద్దీ ఫిర్యాదులు తమ యూఎస్సీ నంబర్లతో సహా ఇస్తుంటే ఇవన్నీ నిజమైనవి కావంటూ కొట్టిపారేయడం ఆ డైరెక్టర్లకే చెల్లింది. ఆయా ప్రాంతాల్లో కరెంట్ ఎప్పుడో ఒకసారి పోయి ఉంటుందని నిర్లక్ష్యంగా చెప్పడమే కాకుండా రెండు మూడురోజుల కిందట కురిసిన వర్షం, గాలివానల కారణంగా అక్కడకక్కడా ఇబ్బంది కలిగి ఉంటుంది తప్ప.. అసలు కరెంట్ పోతున్న పరిస్థితులే లేవంటూ ఓ డైరెక్టర్ బహిరంగంగానే వ్యాఖ్యానించడం వారి పనితీరును చాటిచెబుతున్నది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కేవలం ఆఫీసులకే పరిమితమై ఎక్స్‌లో వస్తున్న ఫిర్యాదులను రాజకీయం చేస్తూ సీఎండీ వరకు ఈ వ్యవహారం తీసుకుపోకుండా ఒకవేళ ఆయన ఈ ఫిర్యాదులపై అడిగినప్పుడు ఇవన్నీ వస్తుంటాయి.. పోతుంటాయి..
మనం పట్టించుకుంటే అన్నీ చేయలేం సార్ అని ఆయనను పక్కదారి పట్టిస్తున్నారంటూ డిస్కం ప్రధాన కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయంటే అవి ఎక్కడో ఒక దగ్గర తప్ప అన్నిచోట్ల కరెంట్ డిమాండ్‌ను తట్టుకునేలా వ్యవస్థ కొనసాగుతున్నదని, క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప అసలు వ్యవస్థను సరిదిద్దడానికి కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టడం లేదంటూ డైరెక్టరపై రిటైర్డ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక వేసవి సమయంలో అప్రకటిత కరెంట్ కోతలకు కారణాలను విశ్లేషించి వాటిని పరిష్కరించడానికి కృషి చేయడంలో విఫలమవుతున్నారంటూ డిస్కంలో చర్చ జరుగుతోంది.