Fake Calls | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): గతంలో వేరే దేశం కోడ్ నెంబర్లతో కాల్స్ వస్తే ఎత్తకున్నా ఫర్వాలేదు అనుకునేవారు.. కానీ ఇప్పుడేమో మిస్డ్ కాల్స్ వచ్చి పోతే ఇదేంటోఅని తిరిగి డయల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ఇతర దేశాల కోడ్ నెంబర్లతో ఫోన్లు చేస్తారు.. లేదా మిస్డ్ కాల్స్ ఇస్తారు.. అవి చూసి ఫోన్ ఎత్తినా, కాల్‌బ్యాక్ చేసినా వారి పని అంతేసంగతులు.. మీరు సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడ్డట్లే.. ఊహించని సమస్యల్లో చిక్కుకున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరదీశారు.
మిస్డ్ కాల్స్, వర్చువల్ కాల్స్‌తో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. ముందు తాము కాల్ చేయాలనుకున్న వ్యక్తికి వేరే దేశాల కోడ్స్‌తో మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తారు. కాల్ వచ్చింది కదా అని తిరిగి కాల్ బ్యాక్ చేశామంటే బ్యాంక్ అకౌంట్‌తో లింకైన ఫోన్‌నెంబర్ ద్వారా డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతిలో పడ్డట్లే. ఇండియాకు చెందిన 91 కోడ్‌తో మినహా ఏ ఇతర ఇంటర్నేషనల్ కోడ్‌తో కాల్స్ వచ్చి కట్ అయిందంటే తిరిగి కాల్ చేయవద్దని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇది సైబర్ నేరగాళ్లు చేసే కాల్..! ఈ కాల్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకొక తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫారెన్ కోడ్స్‌తో ఫోన్లు చేసి అవతలవారి పర్సనల్ డేటాను లాగేసి వారిని సమస్యల్లో చిక్కుకునేలా చేస్తున్నారు. ఒకవైపు రెగ్యులర్ కాల్స్ మాత్రమే కాకుండా వర్చువల్ నెంబర్స్‌తో కాల్ చేసి ఆన్సర్ చేసేలోగా కట్ చేస్తారు. తిరిగి కాల్ చేసిన వారి నెంబర్స్ లిఫ్ట్ చేయడంతోనే వారి ఫోన్‌నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవుతుంది. సదరు వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం నేరగాళ్ల చేతికి చేరుతుంది.
దీంతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. 91 మినహా 255, 371 , 375, 281సహా ఇతర దేశాలకు చెందిన కోడ్స్‌తో ఐఎస్డి కాల్స్ చేస్తున్నారు. ఇందుకోసం వివిధ దేశాల కోడ్స్‌తో ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ)నెంబర్స్ వినియోగిస్తున్నారు.
కొన్ని కాల్స్‌కి ఆన్సర్ చేసినప్పటికీ నేరగాళ్లు #90 లేదా #09 ను డయల్ చేయాలని చెప్తారు. ఇలా చేస్తే సిమ్ వివరాలు క్లోన్ చేయడానికి నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లే. దీనితో సిమ్వివరాలు నేరగాళ్ల చేతికి చేరతాయి. అ తరవాత డయల్ చేసిన వారి అకౌంట్ హ్యాక్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్స్‌తో లింక్ అయిన ఫోన్‌నెంబర్ ట్రాప్ చేసి ప్రొఫైల్ అంతా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. మిస్డ్ కాల్స్ ద్వారా ప్రీమియమ్ రేట్ సర్వీస్ స్కామ్ కూడా జరుగుతున్నట్లు సైబర్ పోలీసులు గ్రహించారు. దీనిని ఉపయోగించి స్కామర్లు సాధారణ ప్రజలను బురిడీ కొట్టించి అంతర్జాతీయకాల్స్ చేయడం ద్వారా డబ్బులు నష్టపోతారు.
వర్చువల్ కాల్స్, మిస్డ్‌కాల్స్‌తో ట్రాప్ చేసే క్రమంలో సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ నెంబర్ల ద్వారా మిస్డ్ కాల్స్ ఇస్తారు. ఈ కాల్‌ను పొందినవారు తిరిగి కాల్ చేసినప్పుడు స్కామర్లు వెంటనే కాల్ చేసిన వారి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్‌కార్డ్స్, కాంటాక్ట్లిస్ట్ నేషనల్ బ్యాంక్స్ పేరుతో ట్రూ కాలర్, అందమైన అమ్మాయిల డీపీలు పెట్టుకుంటున్నారు. ప్రధానంగా మహిళల ఫోన్స్ హ్యాక్ చేసినప్పుడు ఖచ్చితంగా వారి కాంటాక్ట్ లిస్ట్ దొరికితే సమస్యలు వస్తాయి. అందులో ఉన్నవారిని కూడా ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ కోడ్‌తో వచ్చే ఏ కాల్‌ను ఎత్తవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ఇటువంటి మోసాలకు ఎక్కువగా ఐటీ ఉద్యోగినులే నష్టపోతున్నారని, చదువుకున్నవారే దెబ్బతింటున్నారని పేర్కొన్నారు.