మేడ్చల్, జూలై20(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుకున్న మేరకు స్థలం లేకపోవడంతో ఇళ్లు లేని నిరుపేదలకు ఇండ్లను అందించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో డబుల్ బెడ్రూంలను నిర్మించారు. అయితే ఇందులో నిర్మించిన డబుల్ బెడ్రూం స్థానికులు 10 శాతం కేటాయించే విధంగా నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా 27, 472 డబుల్ బెడ్రూంలను నిర్మించడమే కాకుండా అర్హులైన లబ్ధిదారులకు అందజేసింది. స్థానికులకు డబుల్ బెడ్రూంలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటుండగా ఎన్నికల ప్రకటన వచ్చిన క్రమంలో స్థానికులకు కేటాయింపులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన డబుల్ బెడ్రూంలను స్థానికులకు 10 శాతం కేటాయింపులపై నిర్లక్ష్యం వహిస్తుంది. జిల్లాలోని దమ్మాయిగూడ(అహ్మద్‌గూడ), పోచారం, నాగారం(రాంపల్లి), తూకుంట, గుండ్లపోచంపల్లి, పీర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్‌నగర్, మురహరిపల్లిలో 27,472 డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు. కాగా ఇందులో నుంచి స్థానికులకు 10 శాతం కేటాయింపులపై జిల్లా అధికారులను కలిసిన స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అర్హులను గుర్తించి కేటాయించండి…
అర్హులను గుర్తించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలను అందజేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. డబుల్ బెడ్రూంలను నిర్మించి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాడుకలో లేకపోవడం మూలంగా మళ్లీ మరమ్మతులు చేయాల్సి వస్తుందని, తక్షణమే అధికారులు దృష్టి సారించి కేటాయింపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికులకు డబుల్బెడ్రూంలను కేటాయించే విధంగా ఇటీవల ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీసుకువెళ్లిన అధికారులు మాత్రం కేటాయింపులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అలాగే డబుల్ బెడ్రూమ్లలో ప్రస్తుతం నివసిస్తున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నీటి సౌకర్యంతో పాటు డబుల్ బెడ్రూమ్ల నిర్వహణ కమిటీలు వేసే విధంగా చూడాలని అధికారులను కోరుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో లేని డబుల్ బెడ్రూమ్ల నిర్వహణ స్థానిక మున్సిపాలిటీలకే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిన విషయం విధితమే.