సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల లోవోల్టేజీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు మరింత పెరిగాయి. తరచుగా వచ్చే కరెంట్ హెచ్చుతగ్గులతో వినియోగదారుల గృహోపకరణాలన్నీ దెబ్బతింటున్నాయని పలు కాలనీల నుంచి ఎస్పీడీసీఎల్కు ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సింది పోయి అసలు పట్టింపే లేకుండా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకపక్క ప్రభుత్వం నుంచి విద్యుత్ విషయంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ , నాణ్యత విషయంలో చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంట్ ఇచ్చినా, 24 గంటల కరెంట్ ఇచ్చినా ఎప్పుడూ ఇంత సమస్య లేదని సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు పేర్కొంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ నాణ్యతలో అనుమానం ఉందని, గతంలోనే నిపుణులు చెప్పారు. ప్రస్తుతం లోడ్ పెరుగుతున్నందున లోవోల్టేజీ సమస్యలు వస్తున్నాయని, వాటిని అధిగమించడానికి పలుచోట్ల డీటీఆర్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
మండిపడుతున్న వినియోగదారులు..
నగరంలోని పలు ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరశివార్లలో అక్రమంగా తీసుకుంటున్న కరెంట్‌తో లోడ్ పెరిగి నిజమైన వినియోగదారులు నష్టపోతున్నారని ఓ విద్యుత్ అదికారి చెప్పారు. ఈ లోడ్‌ను తట్టుకోవడానికి తాము ఎన్ని ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసినా.. ఈ అక్రమ కరెంట్ వాడకాన్ని నిలువరించకపోతే లోడ్ పెరుగుతుందని, అంతేకాకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది లైన్లను, డిటిఆర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కానీ అలా జరగడం లేదని ఆ అధికారి తెలిపారు.
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నా సరిగా స్పందించడం లేదని, రకరకాల కారణాలు చెబుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. డిమాండ్‌కు సరిపడా కరెంట్ లేనప్పుడే ఇటువంటి లోవోల్టేజీ సమస్యలు వస్తాయని,ట్రాన్స్ఫార్మర్లపై పెరిగిన భారాన్ని గుర్తించి, అక్కడ అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని లేదా ఆ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచడమో చేయాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే లోవోల్టేజీ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని వినియోగదారులు వాపోతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
మా ఏరియాలో లో వోల్టేజీ సమస్య ఎక్కువగా ఉంది. ఎప్పుడు కరెంట్ ఎలా ఉంటుందో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోతాయనే భయం ఉంది. ఎలక్ట్రిషియన్‌కు చెబితే అది పోల్ మీద, ట్రాన్స్ఫార్మర్ దగ్గర సమస్య ఉందంటున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. విద్యుత్ శాఖ పట్టించుకోవడం లేదు. మా కాలనీలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. చెబుతున్నా మా ఏరియా సిబ్బంది పెద్దగా పట్టించుకోరు.
– యశ్వంత్, సాయినగర్‌కాలనీ
ఫోన్ చేసినా.. స్తందన లేదు..
ఐదురోజులుగా పెద్ద ఎత్తున కరెంట్ లోవోల్టేజీలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మా ఏరియా ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. లైన్మెన్కు చెప్పాం. లోఓల్టేజితో చాలా ఇబ్బందులవుతున్నాయి. వర్షం పడుతుంటే లైన్లన్నీ జామ్ అవుతున్నాయని సిబ్బంది ఒకరు చెప్పా రు. సమస్య ఎలా పరిష్కారం కావాలని అడిగితే పెద్ద సార్లు దృష్టి పెట్టాలి.. వాళ్లేం చెప్పట్లేదంటున్నారు. స్థానిక అధికారులతో పాటు 1912కు కూడా కాల్ చేశాం. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు.
– సయ్యద్ మసరత్ అలీ, న్యూ అల్లాపూర్, బోరబండ
సమస్య తీవ్రంగా ఉంది..
మా కాలనీలో లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. వర్షం పడితే పోల్ మీద స్పార్క్‌లు రావడం, ఎక్కడ మంటలు వస్తాయో, షాక్ కొడుతుందోనంటూ భయంతో ఉంటున్నాం. ఈ విషయం విద్యుత్ సిబ్బందికి చెబుతున్నా, ఫిర్యాదులు చేస్తున్నా వారి నుంచి స్పందనే లేదు. కరెంట్ బిల్లు తీయడానికి వచ్చే ఆపరేటర్లకు కూడా చెబుతున్నాం. ఏరియా లైన్మెన్కు చెబుతున్నాం. సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంట్లో మిక్సిలు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోతున్నాయి. పోల్, ట్రాన్స్ఫార్మర్ విషయం చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సమస్య ఎలా తీరుతుంది.
– శ్రీనివాస్, టీఎన్జీఓస్ కాలనీ, ఫేజ్-2 స్థానికుడు