నారాయణఖేడ్, మార్చి 27: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంట రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంతన లేని ప్రకటనలు చేస్తూ అసంపూర్తిగా వదిలేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రెండు దఫాలు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని, రైతులు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేసి ఉదారత చాటుకున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా రైతుబంధు ఇవ్వడంతో పెద్ద భూస్వాములకు మాత్రమే లబ్ధి చేకూరిందని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ట్రాక్టర్లు మొదలుకొని అన్ని వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిందన్నారు. రైతుబంధుతో అత్యధిక శాతం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో చెరువుల మరమ్మతుల పేరిట నిధులు కాజేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లతో చెరువులను పునరుద్ధరించినట్లు గుర్తు చేశారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు రాని నీటి సమస్య, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లివ్వలేని అసమర్థ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ప్రజలను మభ్య పెడుతున్నారని, 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏవిధంగా పక్కదారి పట్టిందో అందరికీ తెలిసిందేనన్నారు.
జూకల్ శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తుదిదశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన బిల్లు మంజూరు చేయించడంపై ఎమ్మెల్యే ఎందుకు దృష్టి సారించడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చేస్తున్న ప్రతి ఆరోపణ తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమావేశంలో రవీందర్ నాయక్, ఆహీర్ పరశురామ్, నగేశ్, పార్శెట్టి సంగప్ప, విఠల్‌రావు, లయక్, అంజాగౌడ్, నర్సింహులు, రవినాయక్, మల్గొండ, మశ్చేందర్, సలీమ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.