మేడ్చల్: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ పెద్దల తీరు. ఒకవైపు సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే (Samagra Survey)తప్పుల తడకగా ఉందని దుమారం రేగుతుండగా, మరోవైపు సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. నమోదు పూర్తయిన వెంటనే డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ మేడ్చల్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్యూమరేటర్, సూపర్వైజర్లకు డబ్బులు అందలేదు.
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణన సర్వేను గతేడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభించింది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులను.. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లుగా నియమించుకుంది. ఇంటింటి సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12వేల గౌరవ వేతనంగా నిర్ణయించింది. సర్వే పూర్తయిన తర్వాత డేటా నమోదుకు ప్రత్యేకంగా ఆపరేట్లను నియమించుకున్నారు. ఇందుకోసం వారికి ఒక్కో కుటుంబ ఫారంలో ఉన్న సమాచారాన్ని నమోదు చేసేందుకు గాను రూ.30 ఇస్తామని నిర్ణయించారు. ఈ క్రమంలో నవంబరు 6వ తేదీన ప్రారంభమైన సర్వే, నమోదు డిసెంబర్ రెండో వారం వరకు కొనసాగింది.
ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయగా వారి పనితీరును సూపర్వైజర్లు, అధికారులు పర్యవేక్షించారు. అయితే, ‘ఇంటింటికీ వెళ్లి సర్వేచేసే సమయంలో ఎంతోమంది సర్వేకు నిరాకరించారు. కొన్నిచోట్ల ఛీత్కారాలు ఎదురైనా ప్రజలను ఒప్పించి, వివరాలు సేకరించారు ఎన్యూమరేటర్లు. నమోదు పూర్తయిన వెంటనే డబ్బులు తమ ఖాతాల్లో జమ చేస్తామని, బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకున్నప్పటికీ మేడ్చల్ జిల్లాలో ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు జమచేయలేదని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. అయితే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం ఇచ్చినట్లు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు నెల రోజులు, నమోదుకు మరో 10 రోజులు కష్టపడాల్సి వచ్చిందని, మొత్తంగా 40 రోజుల పాటు కష్టపడినప్పటికీ ఇప్పటికీ చిల్లిగవ్వ ఇవ్వలేదని వారు మండిపడుతున్నారు.
సమగ్ర సర్వేకు 10 మంది ఎన్యూమరేట్లకు ఒక సూపర్వైజర్ చొప్పున నియమించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో వందల సంఖ్యలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు సర్వే కోసం పనిచేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పనిచేసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.., మేడ్చల్ మున్సిపాలిటీలో 128 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు, పోచారం మున్సిపాలిటీలో 91 మంది ఎన్యూమరేటర్లు, 11 మంది సూపర్వైజర్లు, జవహర్నగర్ కార్పొరేషన్లలో 229 మంది ఎన్యూమరేటర్లు, 14 మంది సూపర్వైజర్లు, పీర్జాదిగూడ కార్పొరేషన్లో 245 మంది ఎన్యూమరేటర్లు, 26 మంది సూపర్వైజర్లు, నాగారంలో 128 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు, కీసరలో 81 మంది ఎన్యూమరేటర్లు, 8 మంది సూపర్వైజర్లు, ఘట్కేసర్ మున్సిపాలిటీ 119 మంది ఎన్యూమరేటర్లు, 14 మంది సూపర్వైజర్లు పని చేశారు.
అలాగే, గుండ్ల పోచంపల్లి, తూంకుంట మున్సిపాలిటీలు, మేడ్చల్, శామీర్పేట, మూడు చింతలపల్లి మండలాల్లో వందల సంఖ్యలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పనిచేశారు. ఒక్క మేడ్చల్ మున్సిపాలిటీ తీసుకుంటే ఎన్యూమరేటర్లకు రూ.12.8 లక్షలు, సూపర్వైజర్లకు రూ.1.56 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇలా నియోజకవర్గం మొత్తమ్మీద రూ.కోట్లలో చెల్లించాల్సి వుంది. అలాగే, డేటా నమోదు ఆపరేటర్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం ఖాతాలో జమచేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు కోరుతున్నారు.