హయత్‌నగర్, ఫిబ్రవరి 11: ఆర్టీసీ సంస్థ ద్వారా భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకోవచ్చని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం హయత్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డిపో-1 మేనేజర్ టి.రఘు ఆధ్వర్యంలో కార్గో పార్సిల్ ద్వారా 5 కేజీల వరకు బంగారం(బెల్లం) మేడారంలోని అమ్మవార్లకు పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హయత్‌నగర్ డీవీఎం పీవీ గణపతిరాజు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తమ వృత్తిరీత్యా బిజీగా ఉండటంతో మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకోలేని వారికి ఆర్టీసీ సంస్థ కార్గో ద్వారా బంగారాన్ని పార్సిల్ పంపించి మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించడం సంతోషకరమన్నారు. తక్కువ ఖర్చుతో అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవచ్చని, మేడారం జాతరకు వెళ్లలేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హయత్‌నగర్ కార్గో పార్సిల్ ద్వారా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మొదటి బంగారం పార్సిల్‌కు నగదు చెల్లించి తన మొక్కును తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఐ రమాదేవి, సిబ్బంది శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, మైసా నరేశ్, తదితరులు పాల్గొన్నారు.