GHMC | సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్‌లో దాదాపు 30 నుంచి 40 శాతం మందులను బయట తీసుకోవాలంటూ ఆయా దవాఖానల్లోని ఫార్మసీ సిబ్బంది చెప్పడంతో రోగులు ఉసూరుమంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం, వంటి నొప్పులు తదితర లక్షణాలతో కూడిన వైరల్ ఫీవర్స్‌తో దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అవసరమైన చిన్నపాటి జలుబు, దగ్గు వంటి మందులు కూడా అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజేంద్రనగర్ సీహెచ్‌సీలో మందుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో కనీసం జలుబుకు సంబంధించిన సీపీఎం మాత్రలు కూడా అందుబాటులో లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాజేంద్రనగర్ సీహెచ్‌సీకి పెద్ద సంఖ్యలో రోగులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలతో శనివారం ఓపీకి వచ్చిన రోగుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో మందులు రాసిచ్చారు. ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఫార్మసీ కౌంటర్‌కు వెళ్లిన రోగులకు అక్కడి సిబ్బంది నుంచి చుక్కెదురైంది. వైద్యులు రాసిన మందుల్లో జలుబుకు సంబంధించి సీపీఎం తదితర మందులు లేవని, వాటిని బయట కొనుగోలు చేసుకోమని చెప్పడం గమనార్హం.