ENT Hospital | సిటీబ్యూరో, మార్చి13,(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. కేసీఆర్ సర్కార్ వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని కాలరాస్తుంది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా సిబ్బంది కొరత వెంటాడుతుంది. సకాలంలో వైద్యమందించేవారు లేక రోగులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధానిలో ఉన్న ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్న వారి మీదే అధిక ఒత్తిడి తెస్తున్నారు.
హైదరాబాద్లో ఉన్న ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచి మాత్రమే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలనుంచి సైతం రోగులు వస్తుంటారు. ప్రతి సోమవారం సుమారు 2000 మంది వరకు ఔట్ పేషెంట్లు రాగా, మిగతా రోజుల్లో 1500 వరకు వస్తుంటారు. 125 మంది వరకు ఇన్ ఫేషెంట్లుగా చికిత్స పొందుతుండటం గమనార్హం. ప్రభుత్వాసుప్రతి కావడంతో రోగుల తాకిడి అధికమనే చెప్పాలి. కానీ సరిపడా సిబ్బంది లేక వైద్యం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ప్రస్తుత రోజుల్లో ఈఎన్టీకి రోగుల తాకిడి ఎక్కువైతుంది. దీనిలో భాగంగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. రెండు రేడియోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా వాటిని భర్తీ చేయకపోగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని నియమించారు. అదేవిధంగా నాలుగు ఫార్మాసిస్టు .పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒక ఉద్యోగి కాంట్రాక్ట్ పద్ధతిలోనే సేవలందిస్తున్నారు. మిగతా ఖాళీల ఊసే లేదు. సరిపడా సిబ్బందిలేక పోవడంతో ఉన్నవారితోనే పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి గురవుతున్నారు. సరిపడా సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలని వైద్యులు వేడుకుంటున్నారు. మరోవైపు సిబ్బంది కొరతలేకుండా సత్వర వైద్యం అందించాలని రోగులు, బంధువులు అభిప్రాయపడుతున్నారు.