నల్లకుంటకు చెందిన 40 ఏళ్ల నర్సింహులు జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అదే సమయంలో మూత్రవిసర్జన చేసేందుకు ఆస్పత్రిలోని మరగుదొడ్ల వద్దకు వెళ్లగా దానికి తాళంవేసి ఉంది. చేసేదిలేక పరుగుపరుగున ఆస్పత్రి బయటకు వచ్చి రోడ్డుపక్కన సిగ్గువిడిచి మూత్ర విసర్జన చేశాడు. సికింద్రాబాద్‌కు చెందిన రజిని అనారోగ్య సమస్యలతో స్థానిక పీహెచ్‌సీకి వెళ్లింది. ఆమెకు మూత్ర పరీక్ష చేయాలని వైద్యులు సూచించడంతో శాంపిల్ కలెక్షన్ కోసం మరుగుదొడ్డివైపు వెల్లగా దానికి తాళం వేసి ఉంది. అక్కడున్న సిబ్బందిని అడిగితే గాని తాళం తీయలేని పరిస్థితి.
సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): నగరంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే అక్కడ తాగునీరు లేక, మరుగుదొడ్ల సౌకర్యం లేక అవస్థలకు గురవుతున్నారు. ఉన్న మరుగుదొడ్లకు సిబ్బంది తాళాలు వేసి ఉంచుతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సౌకర్యాలపై నోరు తెరిచి అడిగేవారు లేకపోవడంతో యూపీహెచ్‌సీల్లోని సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా
తయారైంది పరిస్థితి.
గత బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారించి పేదవాడికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత వైద్యమందించారు. నాటి ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు ప్రతి 15 రోజులకోసారి సమీక్షలు నిర్వహించి రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వైద్యులతో చర్చించి వాటిని పరిష్కరిచేవారు. ప్రస్తుత వైద్యారోగ్యశాఖ మంత్రి తన దృష్టికి వచ్చిన సమస్యలను పట్టించుకోకపోగా, కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలంటూ రోగులు వాపోతున్నారు. పేద ప్రజలకు వైద్యసేవలందించే యూపీహెచ్‌సీల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
హైదరాబాద్‌లోని 93 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) గర్భిణులు, బాలింతలతో పాటు దగ్గు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ తదితర రోగాలతో బాధపడుతూ వచ్చేవారందరికీ వైద్యసేవలందిస్తున్నాయి. అయితే ఆస్పత్రిలో ఎక్కడా పరిశుభ్రమైన వాతావరణం కనిపించదు. ప్రతి దవాఖానలో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్స్ ప్రకారం శుభ్రమైన టాయిలెట్లు, రోగులు వేచి ఉండేందుకు వెయిటింగ్ హాల్, కన్సల్టేషన్ రూం మొదలైనవి తప్పనిసరిగా కలిగి ఉండాలి. కానీ హైదరాబాద్‌లోని పలు యూపీహెచ్‌సీలో వైద్యంకోసం వచ్చే రోగులకు మూత్ర విసర్జన చేసేందుకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన రోగులకు ఇది ఆసుపత్రి సిబ్బంది మాత్రమే వాడాలని, రోగుల కోసం కాదంటూ.. బెదిరింపులకు గురిచేస్తున్నారు. మగవారికి ఆరుబయట వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. చివరకు మూత్ర పరీక్షల కోసం శాంపిల్ సేకరణకు కూడా సిబ్బంది అనుమతితోనే టాయిలెట్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.