BRS Party | పటాన్ చెరు, నవంబర్ 6: అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని, అన్ని వర్గాలకు మేలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో ఆశీర్వదించాలని పటాన్ చెరు బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా గురువారం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్, ఆసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కటై మాగంటి సునీతను గెలిపించి, అభివృద్ధి కోసం బలమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, జిన్నారం వెంకటేశ్ గౌడ్, రాజేశ్, భీంరావు, రామకృష్ణ , సందీప్ గోస్వామి, మహేశ్, సన్నీ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.