సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నగరంలో సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది నగరవాసులు, ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు క్యాబ్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి రైడ్ ధరలు అధికంగా చూపించినప్పటికీ రైడ్‌ను కస్టమర్స్ ఓకే చేస్తున్నారు. అయితే లొకేషన్‌కు వచ్చిన క్యాబ్‌లలో డ్రైవర్లు ఏసీ సదుపాయం కల్పించడం లేదు.
ఇదేమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. గిట్టుబాటు కావడం లేదని ఏసీ బంద్ చేశామని చెబుతున్నారు. ఈ పరిస్థితిపై డ్రైవర్లకు, ప్రయాణికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. నగరంలో ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతుండటంతో క్యాబ్ సంఘాలన్నీ తమ యాప్ ఆగ్రిగేటర్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆగ్రిగేటర్స్ తమ కమీషన్ తగ్గించుకొని డ్రైవర్లకు సరైన ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
వాహనాల్లో ఏసీ వినియోగిస్తే కిలో మీటర్‌కు రూ.16-18 వరకు భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు కమీషన్స్ ఆపుకొని కిలో మీటర్‌కు రూ.10-12 మాత్రమే చెల్లిస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోతూ ఎలా క్యాబ్‌ల్లో ఏసీ ఆన్ చేస్తామని క్యాబ్ డ్రైవర్ సంపత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కిలో మీటర్‌కు సరైన ధరలు నిర్ణయించేల యాప్ ఆగ్రిగేటర్స్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే నగరంలో ‘నో ఏసీ’ క్యాంపెయిన్ ప్రారంభించామని తెలిపారు.