సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా… తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేషన్లలో ద్వారాలు మూసి ఉంచడం, రాత్రిళ్లు ఎస్కలేటర్లు పనిచేయకపోవడం, ప్రధాన డోర్లకు లాక్ వేసి ఉంచడంతో మెట్రో ఎక్కాలన్నా, దిగాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
ముఖ్యంగా కోర్ సిటీలోని మెట్రో స్టేషన్లు కొంత మెరుగ్గానే ఉన్నా.. శివారులోని స్టేషన్లతో సమస్యలు ఎదురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. రాత్రి 11.45 వరకు మెట్రో ద్వారా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సేవలు ఉండగా, శని, ఆదివారాల్లో రాత్రి 11గంటల వరకు చివరి మెట్రో సర్వీసు బయలుదేరుతోంది.
అయితే సమయాన్ని 15 నిమిషాలు పెంచినా…స్టేషన్ల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందులపై మెట్రో నిర్వహణ సంస్థ దృష్టిపెట్టడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినా… సిబ్బంది వ్యవహార తీరు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. కనీసం రాత్రి పూట విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా చూడాలని మెట్రో సంస్థ ఆదేశించడం లేదని వాపోతున్నారు.
శివారు స్టేషన్ల వద్ద ఇబ్బందులు
నగరంలో ప్రస్తుతానికి మియాపూర్, ఎల్బీనగర్ ప్రధానమైన మెట్రో స్టేషన్ల నుంచి ఎక్కువ రాకపోకలు సాగుతున్నాయి. ఏపీతోపాటు, నల్గొండ, ఖమ్మం వైపు వెళ్లేందుకు ఎక్కువ మంది ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. దీంతో అర్ధరాత్రి కూడా ఈ మార్గంలో రద్దీ కనిపిస్తోంది. అయితే అమీర్పేట్ వరకు వచ్చే సరికి సిటీ నుంచి హయత్నగర్, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి వైపు వెళ్లే వారితోపాటుగా, మియాపూర్ వైపు వెళ్లేందుకు ఎక్కే ప్రయాణికులు రాత్రి సమయంలో శివారు మెట్రో స్టేషన్లు అయినా ఎల్బీ నగర్, మియాపూర్ వద్ద ఇబ్బందులు తప్పడం లేదు.
గడిచిన కొంత కాలంగా రాత్రి 11గంటలు దాటిందంటే సిబ్బంది నేరుగా ప్రధాన ద్వారాలు మూసి ఉంచడంతో మెట్రో ఎక్కాలంటే తీవ్ర ఇబ్బంది అవుతుందనీ, రాత్రి పూట ఎస్కలేటర్లు నిలిపివేయడంతోపాటు, కారిడార్లలో లైట్లు కూడా నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు. ఖైరతాబాద్ మీదుగా నిత్యం ఎల్బీనగర్ వరకు ప్రయాణించే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ… ‘చివరి సర్వీసులో జర్నీ అంటే కొంత అసౌకర్యంగా ఉంది.
ఎందుకంటే స్టేషన్ల ప్రాంగణంలో కనీస భద్రత కరువైంది, పరిసరాల్లో తాగుబోతులు, నిరాశ్రయులు, గుమ్మికూడి ఉండటంతో ఆడవాళ్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కోసారి మెట్ల మార్గంలో ఉండే షెట్టర్లను కూడా నిలిపివేస్తున్నారు’ అంటూ వివరించారు. మెట్రో సమయం పొడిగించినట్లుగానే స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక నైట్ షిఫ్టులు ముగించుకుని ఐటీ కారిడార్ నుంచి వచ్చే టెక్కీలకు కూడా కొన్ని స్టేషన్లలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో మెట్రో స్టేషన్ల వద్ద భద్రత ఏర్పాట్లతోపాటు, డోర్లు మూసి వేయకుండా ఉంచాలని, చివరి సర్వీస్ గమ్యస్థానం చేరేంత వరకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.