Election Code | సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీస్స్టేషన్లు, ట్రై పోలీస్ కమిషనరేట్ల సరిహద్దులలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే విషయం తెలిసిన ప్రజలు కూడా చాలా మంది జాగ్రత్తలు తీసుకున్నారు.
గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో భారీ ఎత్తున నగదు, నగలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు రూ.50 వేల కంటే ఎక్కువగా డబ్బు రవాణా చేస్తే తప్పని సరిగా ఆ నగదుకు సంబంధించిన రసీదు ఉండాలి. గత అనుభవాలను దృష్టి ఉంచుకొని చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసు సిబ్బందికి బందోబస్తు అంశాలను ఉన్నతాధికారులు ఇప్పటికే వివరించారు. అన్ని విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సిద్ధమయ్యారు.
మూడు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలీసులు, పార్లమెంట్ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు తగిన బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల వేల ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యం ఇతర సామగ్రి పంచే అవకాశం ఉంటుంది. అదే విధంగా అక్రమ రవాణా కూడా ఉంటుంది. వీటిని అడ్డుకోవడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మలక్‌పేట, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సౌత్-ఈస్ట్ జోన్ డీసీపీ ధరావత్ జానకీ, మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి, ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.లక్షా ఐదు వేలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈసీఐఎల్ సైనిక్‌పురికి చెందిన శ్రీధర్ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణిలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీధర్ అతడి భార్య శిరీషతో కలిసి కొత్తపేట నుంచి కూకట్పల్లి వైపు వ్యాగన్ ఆర్ కారులో వెళ్తుండగా, దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శిరీష హ్యాండ్ బ్యాగును తనిఖీ చేయగా.. అందులో రూ. లక్షా ఐదు వేలు లభించాయి. నగదుకు సంబంధించిన వివరాలను పోలీసులు అడుగగా, బంగారం కొనేందుకు నగదు తీసుకెళ్తున్నట్లు చెప్పి.. సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సౌత్-ఈస్ట్ జోన్ డీసీపీ ధరావత్ జానకీ, మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ ఆంజనేయులు, ఎస్ఐ సీహెచ్. సురేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.