హైదరాబాద్: హైదరాబాద్ హయత్‌నగర్‌లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జీ స్కూల్ వద్ద ధర్నా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పాఠశాల నుంచి నేషనల్ హైవే వరకు ర్యాలీ నిర్వహింస్తున్నారు. ఫీజులను తగ్గించాలని ఇప్పటికే తాము స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని, అయినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు పెంపు విషయాన్ని డీఈవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. స్లాబ్ సిస్టం అని చెబుతూ ఒక్కో తరగతికి ఒక్కో విధంగా 30 శాతం నుంచి 50 శాతం ఫీజులను ఒకేసారి పెంచారని విమర్శించారు. జీ స్కూల్ యాజమాన్యం డౌన్ డౌన్, యాజమాన్యం మొండి వైఖరి నశించాలని అంటూ నినాదాలు చేస్తున్నారు.