NIMS | ఖైరతాబాద్, అక్టోబర్ 23 : సంవత్సరాల తరబడి గుండె జబ్బు, ఆయాసంతో బాధపడుతున్ను ఓ మహిళకు నిమ్స్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన వెంకటనాగ శార్వాణి (30) పాథాలజిస్టుగా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే ఆమె గుండెకు రంద్రం పడింది. సరైన చికిత్స తీసుకోకపోవడంతో కొంత కాలంగా గుండె నొప్పి, ఆయాసంతో బాధపడుతున్నారు. గత పదేండ్లుగా నిమ్స్ దవాఖానలోని కార్డియాలజి విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్య పరిభాషలో ఆమెకు ఎసిమెంజర్స్ సిండ్రోమ్, సబ్సిస్టమిక్ పల్మనరీ హైపర్‌టెన్షన్ అంటారు. ఈ సమస్య ఉన్న వారికి శాశ్వత చికిత్స కేవలం గుండె మార్పిడిమాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య వల్ల రోగి ఊపిరితిత్తులకు వెళ్లే నరాల్లో రక్త సరఫరాపై అధిక ఒత్తిడి కలుగుజేస్తుంది. ఫలితంగా హార్ట్ ఫేయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.
అత్యాధునిక పరికరాలు సంతరించుకున్న నిమ్స్ దవాఖానలో అరుదైన చికిత్స విధానం ద్వారా రోగి ఉపశమనం కలిగించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రామకుమారి నేతృత్వంలో డాక్టర్ నూషా దొడ్డి, డాక్టర్ ఉమా దేవి, కరూరు, డాక్టర్ అజేయ కాశ్యమ్, డాక్టర్ ఎం. మౌనిక, డాక్టర్ పి. వినయ్ కుమార్, డాక్టర్ కె. భరత్ రెడ్డి, డాక్టర్ నరేశ్ నాయుడు, డాక్టర్ చంద్రకాంత్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా చికిత్సను నిర్వహించారు. త్రీడి మ్యాపింగ్‌ను ఉపయోగించుకొని ఆధునిక పల్మనరీ ఆర్టరీ డీనర్వేషన్ ప్రక్రియ ద్వారా గుండే నుంచి ఊపిరితిత్తులకు మధ్య ఉండే నరాలకు క్యాథటర్ ద్వారా విద్యుత్ తరంగాలను ప్రసరింప చేసి రక్త సరఫరాను క్రమబద్దీకరించి ఒత్తిడిని తగ్గించారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచంలో కేవలం 200 మందికి మాత్రమే ఈ తరహా చికిత్సలు నిర్రవహించారని, భారతదేశంలో సైతం ఆరు కేసులు మాత్రమే అయ్యాయని, నిమ్స్‌లో తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈ చికిత్స నిర్వహించామని వైద్యులు తెలిపారు.