సిటీబ్యూరో/బండ్లగూడ, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): జీడిపప్పు సంచుల అడుగున గంజాయి పెట్టి ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో గంజాయి రవాణా, సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2.70కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్‌జోన్ డీసీపీ చైతన్యకుమార్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్వైపు గంజాయి రవాణా చేస్తున్నారు.
బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి ఉందనే సమాచారంతో సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు డీసీఎంను తనిఖీలు చేయగా రూ.2.70కోట్ల విలువైన 908 కిలోల గంజాయి లభించింది. మొహమ్మద్కలీం ఉద్దీన్, షేక్ సొహైల్, మహ్మద్ అఫ్జల్ అలియాస్ అబ్బులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన రెహమాన్, ఒడిశాకు చెందిన జిత్తు, శ్రీకాకుళానికి చెందిన సురేశ్, మహారాష్ట్రకు చెందిన మహేశ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
విచారణలో ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరిలో మారుమూల అటవీ ప్రాంతంలో సురేశ్, జిథు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి ప్లాన్ చేశారని, గంజాయి సరఫరాలో రెహమాన్ ప్రధాన రవాణాదారుడిగా వ్యవహరిస్తున్నాడని, రిసీవర్ మహేశ్ ఒడిశాలోని జిథు, సురేశ్ వద్ద గంజాయి సేకరించారని తేలింది. వారినుంచి డీసీఎం ట్రాన్స్పోర్ట్ వాహనం, నాలుగు మొబైల్ఫోన్లను సీజ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.