సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సామాన్యప్రజలకు రక్షణ లేకుండా పోయిందా..? ప్రస్తుత సంఘటనలు చూస్తుంటే భాగ్యనగరం మరో బీహార్‌గా మారబోతుందా..? అంటే నగరవాసులు అవుననే సమాధానమిస్తు న్నారు. గత సంవత్సరంన్నర కాలంగా ట్రై కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న ఘటనలు, ప్రత్యేకించి ఆరునెలలుగా వరుసగా జరుగుతున్న సంఘటనలతో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. గడిచిన నెలరోజుల్లో దాదాపు 20కిపైగా హత్యలు చోటు చేసుకోవడం పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షలు, రాజకీయ వివాదాలు, వివాహేతర సంబంధాలే ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. గత సంవత్సరంలో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నెలకు సగటున 13 మంది హత్యకు గురికాగా, గత నెల రోజుల్లో ఈ సంఖ్య 20కి మించడం కలవరపెడుతోంది. విస్తృత నిఘాతో వీటిని అడ్డుకోవాల్సిన ఖాకీలు, పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంతోనే పరిస్థితులు చేయి దాటుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో ట్రై కమిషరేట్ల పరిధిలో 41శాతం నేరాలు పెరగగా.. ఈసారి సెప్టెంబర్ వరకే 60 శాతం పెరిగినట్లుగా పోలీసులు అంచనావేస్తున్నారు.
నాలుగురోజుల క్రితం కూకట్‌పల్లిలోని స్వాన్లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ అనే మహిళను బంగారం, డబ్బుల కోసం ఇంట్లో పనిమనిషితోపాటు మరో వ్యక్తి కలిసి కుక్కర్‌తో కొట్టి, కత్తితో గొంతుకోసి చంపేశారు. వంటమనిషి, అతని స్నేహితుడు జార్ఖండ్‌కు చెందిన వారు. గత బుధవారం మధ్యాహ్నం రేణు అగర్వాల్ ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు దుండగులు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి, తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారు. ఆమె చెప్పకపోవడంతో కుక్కర్‌తో ఆమె తలపై బలంగామోది, కత్తితో గొంతుకోసి విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. రెండు నెలల క్రితం గచ్చిబౌలిలో ఓ భవన సెక్యూరిటీ గార్డును ఎలక్ట్రికల్ వస్తువుల దొంగతనం కోసం తలపై బలంగా కొట్టి దుండగులు హత్య చేశారు. ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలోని ఓ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణంలో ఉండగా ఎలక్ట్రికల్ సామాను స్టోర్‌రూమ్‌లో పెట్టారు. వాటికోసం వచ్చిన దుండగులు సెక్యూరిటీ గార్డు రాజు తలపై ఇనుపరాడ్డుతో కొట్టి పోయినట్లు పోలీసులు గుర్తించారు.
గత శుక్రవారం శంకర్‌పల్లిలో కారును అడ్డగించిన దోపిడీ దొంగలు రూ.40 లక్షలు దొంగిలించారు. కరులో స్టీల్ వ్యాపారిని అటకాయించిన దుండగులు కత్తితో బెదిరించి కారులో ఉన్న డబ్బుతో మరోకారులో ఉడాయించారు. దుండగుల వాహనం బోల్తా పడడంతో కారును అక్కడే వదిలేసి బ్యాగుతో ఉడాయించారు. ఈ క్రమంలో రూ.15లక్షలు కారులోనే పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. గత శుక్రవారం కుషాయిగూడలో శ్రీకాంత్‌రెడ్డి అనే రియల్ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. శ్రీకాంత్‌రెడ్డితో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ చేసిన డానియల్, ధనరాజ్ ఇద్దరూ అందులో తమకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీకాంత్‌ను అడ్డు తొలగించాలని ప్లాన్ చేశారు. అతనితో కలిసి మద్యం తాగి శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లే క్రమంలో దారిలో అటకాయించి కత్తితో దాడి చేసిన దుండగుడు అందరూ చూస్తుండగానే మెడను కోసి దారుణంగా హత్య చేశాడు. గత నెల మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో రాజేశ్ అనే వ్యక్తిని అతని భార్య పూనందేవి మరో వ్యక్తితో కలిసి రాయితో తలపై కొట్టి చంపింది.
ఇటీవల కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక సహస్రను పక్కనే ఉన్న మైనర్ బాలుడు హత్యచేశాడు. క్రికెట్ బ్యాట్ కోసం ఆ అమ్మాయిని చంపినట్లు అతను ఒప్పుకున్నాడు. సహస్రను హత్యచేసిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. గత నెలలో చిక్కడపల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ఉద్యోగి నారాయణ ఇంట్లోకి దొంగలు చొరబడి 36తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మేడిపల్లి పరిధిలోని బోడుప్పల్ బాలాజీ హిల్స్‌లో గత 15రోజుల క్రితం మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని గర్భిణి అని తెలిసి కూడా గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను రంపంతో కోసి తల, కాళ్లు, చేతులు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో మూటగట్టి మూసీలో పడేశారు.