e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home హైదరాబాద్‌ మన వాయిస్‌ వినిపించొచ్చు

మన వాయిస్‌ వినిపించొచ్చు

మన వాయిస్‌ వినిపించొచ్చు
  • నాలుగు మంచి మాటలకు వేదిక మన వాయిస్‌ ఫేస్‌బుక్‌ గ్రూప్‌
  • ప్రతిభ ఉండి నలుగురికి చాటాలనే ఉత్సాహం ఉన్న వారికి అవకాశం
  • ఎందరో ఆర్‌జే, వీజే, గృహిణులతో అనేక కార్యక్రమాలు

సిటీ బ్యూరో, జులై 13 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యం, నీతి కథలు, ఆధ్యాత్మిక విషయాలు, పాటలు పాడటం, నటనతో పాటు నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పే వారికి మన వాయిస్‌ వేదికగా మారింది. ఎవరికి వారు తమ భావాలను తెలియపరుస్తున్నప్పటికీ, అన్ని అంశాలను ఒక్కచోట గుదిగుచ్చి మన వాయిస్‌ పేరిట ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఎందరినో అలరిస్తున్నది. వివిధ వృత్తులో కొనసాగే వారు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే తమలో ఉన్న ప్రత్యేకతను నలుగురిలో చాటుకోవాలని భావిస్తున్న గృహిణులు, చిన్న పిల్లలు, వయో, వృత్తి భేదం లేకుండా ప్రతిఒక్కరికి అవకాశం కల్పిస్తున్నామని మన వాయిస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌ వరప్రసాద్‌ యాల చెబుతున్నారు. ఈ గ్రూపులో ఇప్పటివరకు 350 మందికి పైగా ఆర్‌జే, వీజేలు, యాంకర్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. పంటలు పండించే రైతు నుంచి పైలట్‌ వరకు ఎంచుకొని వారి ప్రతిభాపాటవాలను ఇతరులకు తెలిపే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అంతేకాక మన వాయిస్‌ గ్రూపులోని అంశాలను ఇతర సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, లింక్డ్‌ ఇన్‌, పిన్‌ట్రస్ట్‌, కోయాప్‌, షేర్‌చాట్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

అలరిస్తున్నారిలా..

“నీటి ఒడ్డున తల్లి మొసలి.. అడవిలోకి వెళ్లిన పిల్ల మొసలి.. దాన్ని పులి నుంచి కాపాడిన ఏనుగు.. రక్షించిన ఏనుగు పైనే దాడి చేసిన తల్లి మొసలి.. తన ప్రాణాన్ని కాపాడిన ఏనుగుపై దాడి ఎందుకు చేశావని నిలదీసే పిల్ల మొసలి.. అపార్థం చేసుకోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తాయని ఈ కథలో నీతి” అంటూ ఆర్‌జే మౌనిక చెబుతుంది. ఆధ్యాత్మిక విషయాలను ఎప్పటికప్పుడు కొత్తగా చెబుతుంటారు వీజే శ్వేత. కళలు, సాహిత్యాన్ని వివరిస్తారు సత్య మొండ్రేటి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పరిచయం చేస్తారు ఆర్‌జే హిమబిందు. మాటే మంత్రం అంటూ మంచి మాటలు చెప్పడం, ప్రముఖుల వ్యాఖ్యలు.. తాజా సంఘటనలు.. సామాజిక పరిస్థితులు తెలియపర్చడం, ఎప్పటికప్పుడు లైవ్‌ షోలు చేస్తుంటారు పలువురు వీజే, ఆర్‌జేలు. 16 విభాగాల్లో ఆయా అంశాలపై నిరంతరం మన వాయిస్‌ గ్రూప్‌ సభ్యులను అలరిస్తుంటారు. ఇండ్లలోనే ఉంటూ తమ ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియజేసుకునే అవకాశం ఈ గ్రూప్‌తో దక్కిందని ఇది తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందంటున్నారు.

నో వన్‌ నుంచి సమ్‌ వన్‌ వరకు..

- Advertisement -

ఇల్లే ప్రపంచం అనుకునే నేను మన వాయిస్‌ గ్రూప్‌కి కుకింగ్‌ వీడియోలు పంపా. ప్రస్తుతం యాంకరింగ్‌, ఇంటర్వ్యూలు చేస్తున్నా. ఒకప్పుడు నో వన్‌ అనుకున్న నేను సమ్‌ వన్‌ వరకు వెళ్లగలిగా. కుటుంబ ప్రోత్సాహంతో శ్వేత అంటే వేలాది మందికి తెలిసే స్థాయికి వెళ్లా. – వీజే శ్వేత, మనవాయిస్‌ గ్రూప్‌

నాకో మంచి వేదిక దొరికింది..

మన వాయిస్‌కు సూక్తులు, కథలు, సీరియళ్లు రాయడంతో పాటు వాయిస్‌ ఓవర్‌ చేస్తుంటా. నాలోని ప్రతిభను చాటుకునేందుకు ఒక మంచి వేదిక దొరికింది. ఎందరో రచయితలు, కవులు, కళాకారులకు మన వాయిస్‌ గ్రూప్‌ అండగా ఉంటుంది. – సత్య, రచయిత్రి మన వాయిస్‌ గ్రూప్‌

ఆర్టిస్ట్‌గా ఎంతో సంతృప్తి..

ఈ మధ్యే మన వాయిస్‌ గ్రూప్‌తో పరిచయం ఏర్పడగా ఆర్‌జేగా పని చేసే అవకాశం దక్కింది. వెయ్యికి పైగా కార్యక్రమాలు చేయడంతో వీక్షకుల నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కింది. అన్న.. బాబాయి అంటూ పిలుపుతో ఈ గ్రూప్‌ సభ్యులతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మరిచిపోలేనిది. – ఆర్‌జే వెంకట్‌, మన వాయిస్‌ గ్రూప్‌

అందరిలో స్ఫూర్తి పెంచేలా..

మన వాయిస్‌ గ్రూప్‌లోని 15 విభాగాల్లో సందర్భాన్ని బట్టి పాటలు వేయడం.. కంటెంట్‌ పబ్లిష్‌ చేస్తూ అందరిలో స్ఫూర్తిని నింపే అవకాశం నాకు దక్కింది. తక్కువ నిడివి వీడియోలను పెట్టి వీక్షకులను అలరిస్తూ జాగృతం చేయగలుగుతున్నా. – వీఎన్‌.కిశోర్‌, కంటెంట్‌ పబ్లిషర్‌ మనవాయిస్‌ గ్రూప్‌

తక్కువ రోజుల్లో ఎక్కువ గుర్తింపు..

మన వాయిస్‌లో చేరి కొద్ది రోజులు అయినా ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఫేస్‌బుక్‌ చూస్తే ఏమొస్తదిరా అనే వాళ్లకి మన వాయిస్‌ గ్రూప్‌లో సూపర్‌ మచ్చి పేరుతో గిఫ్ట్‌లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రముఖులతో ఇంటర్వ్యూ లు చేయడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
– హిమబిందు ఉడతనేని, ఆర్‌జే మన వాయిస్‌ గ్రూప్‌

లాభాపేక్ష లేకుండా..

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడంతో పాటు ఆనందం కలిగించడమే మా ఉద్దేశం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన వాయిస్‌ గ్రూపును నిర్వహిస్తున్నాం. ఈ వేదిక ద్వారా ప్రతిభ చాటుకునేందుకు అనేక మందికి అవకాశం కల్పిస్తున్నాం. అన్ని కేటగిరీల వారిని ఒక్క గొడుగు కిందకి తెచ్చి వారిలోని ప్రతిభాపాటవాలను అందరికి పరిచయం చేస్తున్నాం. మన వాయిస్‌లోని సభ్యులు ఓ కుటుంబంలా భావించి లక్షలాది మందిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. శ్రీనివాస వరప్రసాద్‌ యాల, ఫౌండర్‌ మన వాయిస్‌ గ్రూప్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన వాయిస్‌ వినిపించొచ్చు
మన వాయిస్‌ వినిపించొచ్చు
మన వాయిస్‌ వినిపించొచ్చు

ట్రెండింగ్‌

Advertisement