Shamhabad | శంషాబాద్ రూరల్, మార్చి 30 : ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో దుర్గంధం వెదజల్లుతుంది. హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు నేడు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శంషాబాద్ పట్టణంలోని తొండుపల్లి ఔటర్ జంక్షన్ నుంచి హిమాయత్‌సాగర్ చెరువు వరకు, తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్ద గోల్కొండ వరకు రోడ్డుకు ఇరువైపుల సర్వీసు రోడ్లలోని కాల్వలు చెత్తచేదారంతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ పట్టణంలోని తొండుపల్లి జంక్షన్ నుంచి కోత్వాల్‌గూడ వరకు ఇరువైపుల ఉన్న కాల్వలు చెత్తతో నిండిపోయాయి. అందులోకి మురుగునీరు చేరడంతో దుర్గంధం వెదజల్లుతుంది.
ఉదయం, సాయంత్రం సమయంలో పట్టణ ప్రజలు భారీ ఎత్తున వాకింగ్ చేయడానికి వస్తుంటారు. కాల్వలలో నిండిన చెత్తచెదారంతో తీవ్ర దుర్వసన వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఔటర్ సర్వీస్ రోడ్లలోని కాల్వలను పరిశుభ్రం చేయించాలని కోరుతున్నారు.