Gandhi Hospital | బన్సీలాల్ పేట్, మే 14 : గాంధీ దవఖానలో ప్రతిరోజు వివిధ ఆరోగ్య సమస్యలతో 1500 మందికి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ తీసుకోవడానికి పెద్ద పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ఆలస్యం జరగకుండా, సత్వరమే చిట్టి పొందేందుకు ఇప్పుడు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఆన్లైన్ నమోదు పద్ధతి
సాధారణ ప్రజలు తమ మొబైల్ ఫోన్లో ఆయుష్మాన్ భారత్ (ఆభా) యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ కావాలి. అనంతరం ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబర్‌కు వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్ కేటాయిస్తారు. దానిని మనం భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో మనం ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళినా ఈ ఆభా నెంబరుతో సులభంగా లాగిన్ కావచ్చు. రోగి ఏ డాక్టర్‌ను సంప్రదించాడు, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు, ఎలాంటి మందులు డాక్టర్ సిఫారసు చేశారు, ఏం చికిత్స అందించారు, తదితర రోగి వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఆటోమేటిక్ గా నమోదు అవుతాయి.
గాంధీ దవాఖానలో బయటి రోగుల విభాగం ద్వారా టోకెన్ నెంబర్ పొందవచ్చు. దాన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లో చెప్పగానే వెంటనే ఓపి స్లిప్ మన చేతికి వస్తుంది. ఇక క్యూ లైన్లో వేచి ఉండే అవసరం లేదు. ఇంట్లో ఉన్నప్పుడే, ఈ యాప్ ద్వారా ఓపీ టోకెన్ నెంబర్ పొందవచ్చు. గాంధీ దవాఖానాలోని ఓపి విభాగం రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఈ యాప్‌కు సంబంధించిన వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు. సిబ్బంది కూడా ఈ యాప్‌ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ప్రతిరోజూ సందర్శకులకు వివరిస్తున్నారు.