Hyderabad Metro | సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ) : దేశంలోని అన్ని మెట్రోల కంటే హైదరాబాద్ మెట్రో చార్జీల భారం ఎక్కువగా ఉంది. ఇటీవల పెరిగిన ధరలతో పోల్చితే 15 శాతానికిపైనే టికెట్ ధరలు ఉన్నాయి. ఇక మెట్రో ప్రయాణికులకు సరైన మౌలిక వసతులు కూడా అందడం లేదు. దీంతో పాటు పార్కింగ్, వాష్ రూం వంటి కనీస వసతులను కూడా డబ్బులు చెల్లిస్తే గాని పొందలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇక మెట్రో స్టేషన్ల వద్ద అరకొరగా ఉన్న పార్కింగ్ సదుపాయాలకు కూడా డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులపై అదనపు భారానికి కారణం అవుతుంది. దీంతోపాటు నగరంలో 30శాతం కూడా లేని లాస్ట్ మైల్ కనెక్టవిటీతో మెట్రో స్టేషన్లకు వచ్చిపోయేందుకు ఎక్కువ మొత్తంలో జేబుకు నష్టం కలిగిస్తున్నాయని సగటు మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు. ఇక తాజాగా మెట్రో చార్జీలను పెంచడం కూడా ప్రయాణికులపై మరో భారమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఖరీదైన మెట్రో ప్రయాణంగా..
69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రోలో చార్జీలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, టెక్ రాజధాని బెంగుళూరులో ఉన్న ధరలతో పోల్చితే కనీస ధరలు రెండింతలుగా ఉన్నాయి. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రో ప్రయాణంగా హైదరాబాద్ నిలుస్తోంది. స్మార్ట్ కార్డు, ఇతర రాయితీలతో పోల్చితే గనుక నగరంలో ప్రయాణికులపై అదనపు భారం తప్పడం లేదు. మౌలిక వసతులు, పార్కింగ్, లాస్ట్ మైల్ కనెక్టవిటీ వంటివి కూడా చెల్లింపు సేవలు కావడంతో మొత్తంగా నగరంలో మెట్రో ప్రయాణానికి జేబులు ఖాళీ చేసుకునే పరిస్థితి వస్తోంది.
కనీస చార్జీలు రూ.25చెల్లించాల్సిందే..
దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీతోపాటు హైదరాబాద్ నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కిలోమీటర్‌కు సగటున కిలోమీటర్‌కు రూ. 1 లోపు ఉంటే…నగరంలో మాత్రం రూ. 1.3లకు పైనే ఉంది. గతంలో ఉండే స్మార్ట్ కార్డు సేవలపై పరిమితులు విధించడంతో నగర వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదుగా మారుతుంది.
ఇక కనీస ధరల వారీగా చూసిన హైదరాబాద్ మెట్రో ఎక్కితే రూ. 25 చెల్లించాల్సిందే. అదే ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో కనీస ధరలు రూ. 15లోపు ఉన్నాయి. అయితే దీనికి పీపీపీ విధానంలో చెప్పడమే కారణమని చెబుతున్నా… ముంబైలోని లైన్ 1ను కూడా ఇదే తరహాలో పీపీపీ విధానంలో చేపట్టారు. ఆ మెట్రో ధరలతో పోల్చిన కూడా మినిమం చార్జీలు రూ. 15 తేడా ఉంది.
అధిక ధరలతో మెట్రోకు దూరం..
నగరంలో మెట్రో ధరలు పెరగడంతో క్రమంగా ఆర్టీసీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో అధిక ధరలతో మెట్రోలో ప్రయాణించడం కంటే ఉచితంగానే ఆర్టీసీ ప్రయాణమే ఉత్తమమని సగటు మహిళలు భావిస్తున్నారు. దీనితోపాటు టికెట్లపై రాయితీలు గనుక ప్రకటిస్తే ఆర్టీసీ బస్సులు మరింత కిక్కిరిపోయే అవకాశం ఉంది.
ఇక పీక్ అవర్స్‌లో మెట్రోలో కనిపిస్తున్న రద్దీ కూడా ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తోంది. దీంతో సౌకర్యవంతమైన మెట్రో ప్రయాణం కాస్తా తోపులాటలు, కిక్కిరిపోయిన బోగీల నడుమ జర్నీ చేయాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇలా నష్టాల పేరిట మెట్రో టికెట్ ఛార్జీలను పెంచడంతో క్రమంలో ప్రయాణికుల సంఖ్య రద్దీ తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.