హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ద్రోహి, ఓటుకు నోటు దొంగ, తెలంగాణ హకులను కాలరాస్తున్న చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డిని ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లోను అడుగుపెట్టనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వద్దు అని, తుపాకీ పట్టుకుని తిరిగిన తుపాకీ రాముడు రేవంత్రెడ్డిఏ ముఖం పెట్టుకొని ఓయూకు వస్తున్నవ్? అని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గడిచిన 20 నెలల కాలంలో తెలంగాణలో అనేకమంది విద్యార్థులు చనిపోయినా సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ 80 కోట్లతో విద్యార్థి వసతి గృహాలను నిర్మిస్తే వాటిని ప్రారంభించడానికి రేవంత్‌రెడ్డి వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓయూలో అడుగు పెట్టాలనుకుంటే విద్యార్థులకు ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, రెండు లక్షల ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పార్ట్ టైం, ఫుల్ టైం టీచింగ్ స్టాఫ్‌కు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే ఓయూలో అడుగు పెట్టాలని హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటామని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తూ ఏ ముఖం పెట్టుకుని వర్సిటీకి వస్తాడని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా, సమస్యలను పరిష్కరించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇరవై నెలల పాలనలో కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా నియమించలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రాజకీయాలకు వాడుకుని నట్టేట ముంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని సిటీ లైబ్రెరీకి తీసుకురావడంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి ఆచరణలో మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలు నిర్వహించిన వారికి ఆర్డర్ కాపీలు అందజేసి తమ ఖాతాలో వేసుకోవడం రేవంత్‌రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు. గతంలో ఓయూ విద్యార్థులను బీరు, బిర్యానీ బ్యాచ్ అంటూ అవమానించిన రేవంత్ స్వార్థ రాజకీయాల కోసం ఓయూను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ సమస్యలు పరిష్కరించిన తరువాతే ఓయూ గడ్డపై కాలుమోపాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఎంతమంది పోలీసు బందోబస్తు మధ్య వచ్చినా విద్యార్థుల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే నైతిక అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ఏబీవీపీ ఓయూ అధ్యక్షుడు దృహన్ వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వర్సిటీకి ఎటువంటి నిధులు విడుదల చేయకుండా రాజకీయ పర్యటనలతో లాభం లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో పర్యటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఏనాడూ వర్సిటీల అభివృద్ధి గురించి ఆలోచించిన దాఖలాలు లేవని అన్నారు. విద్యాశాఖ తన వద్దే ఉన్నా ప్రభుత్వ యూనివర్సిటీలపై సవతితల్లి ప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు. వర్సిటీ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రజాప్రతినిధిని కూడా అడుగుపెట్టనీయమని హెచ్చరించారు.