Revanth Reddy |ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని జాతీయ మీడియా ముందు హేళనగా మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమని, సీఎంగా తన చేతిలో రూ. 500 కోట్లు కూడా లేవని హేళనగా మాట్లాడటం ఆయన మానసిక స్థితికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఆర్థిక అంశాల మీద అవగాహన లేక ఏదిపడితే అది మాట్లాడుతూ అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని తక్కువ చేస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఓయూ జేఏసీ నేతలు మండిపడ్డారు. అవగాహన లేకపోతే ఆర్థిక నిపుణులతో క్లాసులు చెప్పించుకోవాలని ఆయనకు సూచించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 13 హామీలు అమలు పరచడం చేతకాక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అభాసుపాలు చేస్తూ మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉన్నట్టుగా ఆర్బీఐ నివేదికలు, సర్వే సంస్థలు కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతున్నాయని గుర్తు చేశారు. రేవంత్ చేతగాని నాయకత్వం వలన 15 నెలల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దిగజార్చేలా చేశాయని దుయ్యబట్టారు. ప్రతినెల రాష్ట్రానికి 18 వేల కోట్ల ఆదాయం వస్తే అందులో 6 వేల కోట్లు అప్పులకు, గ్యారెంటీలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు పోగా మిగిలిన 12 వేల కోట్లు ఏం చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సొమ్మును అప్పనంగా ఢిల్లీకి కప్పంగా కడుతున్నది వాస్తవం కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఓయూ జేఏసీ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క రోజు కూడా తెలంగాణకు జై కొట్టని రేవంత్.. తెలంగాణకు సీఎంగా ఉండటం తమ దురదృష్టమన్నారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేతలు దత్తాత్రేయ, మంతెన మధు, పెద్దమ్మ రమేష్ ముదిరాజ్, శ్యామ్, రామకృష్ణ, శ్రీకాంత్, అనిల్ ప్రజాపతి, కోడూరు రఘు, దయాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.