ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 8 : ఉస్మానియా యూనివర్సిటీలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణమే అమలు చేయాలంటూ ఓయూ అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్కుమార్నాయక్లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, యూజీసీ డీన్ ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ వెంకటలక్ష్మి, డాక్టర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ సీపీఎస్ అమలు చేయడం ద్వారా తమ పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత ఉంటుందని అన్నారు. 20 ఏళ్లుగా సీపీఎస్ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ సమస్యపై ఎన్నో సార్లు అధికారులకు వినతిపత్రాలు అందించామన్నారు. అయినా ఎప్పటికప్పుడు పెండింగ్‌లోనే పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.