సిటీ బ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/ ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణకు తలమానికమైన విద్యా కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసుల ఆంక్షలతో విద్యార్థులు, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ముఖ్యమంత్రి వెళ్లే దారిలో పది అడుగుల పొడవైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసి దేశ సరిహద్దును తలపించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుగానే విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడంతో పాటు పలువురు విద్యార్థి నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.
సీఎం పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటన సందర్భంగా 24 గంటల డ్యూటీ వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది మురళీరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ముఖ్యమంత్రి ఓయూలో పర్యటించి వర్సిటీ అభివృద్ధి, ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమానికి వరాలు ప్రకటిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకుండానే సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. ఆద్యంతం సీఎం పర్యటన నియంతృత్వ పోకడ, రాచరిక విధానాన్ని తలపించింది.
ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, మేధావులు, పీహెచ్డీ స్కాలర్లు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నిలయమైన ఓయూలో సీఎం ప్రసంగం సొంత డబ్బాకే పరిమితమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ. వెయ్యి కోట్లతో ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి రూపాయి కూడా తక్షణంగా విదల్చకపోవడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
ఓయూ అనేది తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదమని, ఈ గడ్డపై నుంచే పీవీ నరసింహారావు ధిక్కార స్వరం వినిపించారని గుర్తు చేశారు. ఎర్ర జెండా మోసిన ఎంతో మందికి ఓయూ అండగా నిలిచిందని చెప్పారు. తొలి తెలంగాణ ఉద్యమ నాయకత్వం వహించిన చెన్నారెడ్డి లాంటి వారి నుంచి జైపాల్‌రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్ వరకు అందరూ ఓయూ విద్యార్థులేనన్నారు. తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా పోరాటం ఓయూ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నది సైతం ఓయూనేనని పేర్కొన్నారు. ఓయూ ఎంతో మంది మేధావులను అందించిందన్న ఆయన.. ప్రస్తుతం ఓయూ సమస్యలతో కళాహీనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేకుండా ఓయూను కాలగర్భంలో కలపాలనే కుట్రలు జరిగాయని ఆరోపించారు. కానీ ఆయన యూనివర్సిటీకి ఏం చేస్తారో.. సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో మాత్రం చెప్పలేదని విమర్శిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన హాస్టల్ ‘దుందుభి’కి చేరుకున్న రేవంత్ అదే ఆవరణలో దుందుభితో పాటు భీమ హాస్టళ్లను ప్రారంభించారు. ఒక బాలుర హాస్టల్, మరో బాలికల హాస్టల్, రీడింగ్ రూమ్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సింగరేణి, ఓయూ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఓయూలో చేరే 200 మంది రెగ్యులర్ పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.ఐదు వేల చొప్పున అందించనున్న ముఖ్యమంత్రి ఉపకార వేతనాన్ని ఆయన ప్రారంభించారు.
హెచ్ఎండీఏ సహకారంతో రూ.8.5 కోట్లు ఓయూ పేరుతో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీతో ప్రవేశపెట్టిన మరో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఓయూలో చదివే పీజీ, పీహెచ్డీ విద్యార్థుల పరిశోధనల కోసం చేసే విదేశీ పర్యటనలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎంసలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా,
కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కలెక్టర్ దాసరి హరిచందన, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్కుమార్నాయక్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్, బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి, విద్యా కమిషన్ సభ్యుడు చారుకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఓయూకు వచ్చిన ముఖ్యమంత్రికి తమ సమస్యలపై వినతిపత్రాలు అందించాలని అనుకున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులకు నిరాశే ఎదురైంది. అధికారిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సైతం మొండిచేయి చూపించారు. ఎవరూ సీఎంకు వినతిపత్రాలు అందించకూడదని, సమస్యలను వేదికపై తానే సీఎం దృష్టికి తీసుకెళ్తానని వీసీ స్పష్టం చేయడంతో అందరూ తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. వేదికపై వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి వీసీ తీసుకెళ్లినప్పటికీ, రేవంత్ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు ఓయూ అధికారులు పాసులు అందజేశారు. ఆ పాసులను తీసుకుని కార్యక్రమం కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు తీవ్ర అవమానం జరిగింది. కిలోమీటర్ల దూరాన వాహనాలను నిలిపి, కాలినడకన వెళ్లిన మీడియా ప్రతినిధులను సుమారు ఆరు సార్లు తనిఖీలు చేశారు. వాటన్నింటినీ దాటుకుని ఆడిటోరియంకు చేరుకున్న వారిని అనుమతి లేదంటూ బయటే నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు తమను ఎందుకు పిలిచారని ఎదురు ప్రశ్నించారు. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో అక్కడే ఉన్న పోలీసు అధికారులు కల్పించుకుని వారిని లోపలికి అనుమతించారు.