Osmania Cath lab | సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఫలాలు రోగులకు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీతో లక్షల మంది నిరుపేద రోగులు వివిధ రకాల శస్త్రచికిత్సలు, అవయవమార్పిడి వంటి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పొందుతుండగా బీఆర్ఎస్ హయాంలో సమకూర్చిన వైద్యపరికారులు, ల్యాబ్‌లు ఆరోగ్య వసతులు సైతం రోగులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం మారినా నాటి బీఆర్ఎస్ సర్కార్ ఆరోగ్య ఫలాలు మాత్రం రోగులకు పునర్జీవం పోస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉస్మానియా దవాఖానలో ఏర్పాటు చేసిన క్యాథల్యాబ్ పేద హృద్రోగులకు వరంగా మారింది.
తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం ప్రభుత్వ రంగ దవాఖానల్లో గుండె పరీక్షలకు సంబంధించిన క్యాథల్యాబ్ లేకపోవడంతో రోగులకు ఆర్థిక భారం తప్పేది కాదు. అంతే కాకుండా రోగులు బయట పరీక్షలు చేయించుకుని, నివేదికలు తీసుకువచ్చే వరకు చికిత్సలో కూడా జాప్యం జరిగేది. ఇందులో భాగంగానే ఉస్మానియాకు వచ్చే రోగులు సైతం కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సాధారణంగా గుండె సంబంధిత పరీక్షలుగాని, చికిత్సగాని ఖరీదైనవి కావడంతో నిరుపేద హృద్రోగులకు ఆర్థిక భారం తప్పేది కాదు.
దీనిని గమనించిన నాటి కేసీఆర్ సర్కార్ 2022లో రూ.7 కోట్ల రూపాయల వ్యయం వెచ్చించి ఉస్మానియా దవాఖానలో కొత్తగా క్యాథలాబ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ క్యాథలాబ్ ద్వారా నిరుపేదల హృద్రోగులకు ఖరీదైన వైద్యసేవలను పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నారు ఉస్మానియా వైద్యులు.
సాధారణంగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడే హృద్రోగులకు క్యాథల్యాబ్ ద్వారా పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాటి నివేదికల ఆధారంగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. గడిచిన మూడేళ్లలో దాదాపు లక్షమందికి పైగా ఓపీ సేవలు అందించగా వారిలో సుమారు 20వేల మందికి పైగా పలు రకాల గుండె పరీక్షలు జరిపి, అవసరమైన చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.
కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్న ఉస్మానియా క్యాథల్యాబ్కు నిరుపేదలు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్నాటక, మహారాష్ట్రతో పాటు బిహార్, యూపీ తదితర ప్రాంతాలకు చెందిన రోగులు సైతం ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు 1573 ఆంజియోగ్రామ్స్, 913 పీటీసీఏలు, 39016 2డీ-ఈకోలు చేశామని, మొత్తం 40వేల మందికి ఈ క్యాథలాబ్ ద్వారా గుండెకు సంబంధించిన పలురకాల ప్రొసీజర్స్, పరీక్షలు జరిపి చికిత్స అందించినట్లు తెలిపారు.
సేవలు బాగున్నాయి
గుండె పరీక్షల కోసం 2023లో మా అత్తను తీసుకుని ఉస్మానియాకు వచ్చినం. బాగా చేసిండ్రు. అదే నమ్మకంతో ఇప్పుడు మా భర్తను తీసుకువచ్చినం. ఇక్కడికి రావడానికి ముందు ఎమర్జెన్సీ ఉందని ప్రైవేటుకు వెళితే, ఒక రోజులోనే 20వేలు ఖర్చైనయ్. వెంటనే ఉస్మానియాకు వచ్చినం. జనం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి చోట కొంత వెయిటింగ్ తప్పడం లేదు. డాక్టర్లు బాగానే చూసిండ్రు. గుండె పరీక్షలు చేసిండ్రు. ఆంజియోగ్రామ్ చేయాలని చెప్పిండ్రు.
– హసీనా బేగం