సిటీబ్యూరో, మే 31: జనంలో ఉన్నప్పుడు ఏకధాటిగా నీతులు వల్లించటం.. తెర వెనుక బూతుల పురాణం.. ఇదీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అసలు రూపం. డివిజన్ లోని మైనార్టీలు, దళిత సామాజిక జనంలో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయతను ప్రదర్శించడం, అక్కడి నుంచి వెళ్లిన తర్వాత చిన్న చిన్న కారణాలను అదనుగా తీసుకుని అదే జనంపై ఆగ్రహం.. తీవ్ర పదజాలంతో దూషించటం ఫసియుద్దీన్‌కు వెన్నతో పెట్టిన విద్య. బోరబండ డివిజన్లో ఉంటున్న దళితులు, మైనార్టీలు తమకున్న కొద్ది స్థలంలో ఇంటి నిర్మాణాలు మొదలు పెడితే చాలు.. ఫసియుద్దీన్ మనుషులు అక్కడ వాలిపోవటం జరుగుతూ వస్తుంది. సదరు వ్యక్తులు పేదలను బెదిరించి వసూళ్లకు బరి తెగించటం సాధారణ విషయం.
బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్దార్ బలవన్మరణానికి కారకుడైన ఫసియుద్దీన్, ఈయన భార్య హాబీబా సుల్తానా, పీఏ సప్తగిరికి కఠిన శిక్ష పడాల్సిందేనని మైనార్టీలు సహా డివిజన్ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులుగా ఫసియుద్దీన్ మాటలు, వేధింపులకు భయపడ్డ స్థానికులు తాజా సంఘటనతో ఆయనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ వసూళ్ల తో ఆరితేరిన ఫసియుద్దీన్ గ్రేటర్ లోనే కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు అనటంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు రూ.100-200 కోసం తనకు తెలిసిన వాళ్ల ఇండ్ల వద్ద అర్ధరాత్రి వరకు పడిగాపులు కాచిన ఫసియుద్దీన్ అక్రమ వసూళ్లలో కోట్లకు పడగెత్తిన విషయం చర్చనీయాంశంగా మారింది. డివిజన్లో ఎంతో మంది ఉసురు పోసుకున్న ఫసియుద్దీన్, హాబీబా సుల్తానా, సప్తగిరి.. ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డివిజన్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.