మన్సూరాబాద్, ఆగస్టు 18 : బ్రైయిన్‌డెడ్(Brain dead) అయిన మహిళ అవయవాలను దానం(Organ donation) చేసి మరి కొందరికి ప్రాణం పోశారు కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్, శాతవా హననగర్కు చెందిన కాంతాబెన్ పటేల్ (55) ఈ నెల 16న ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా కింద పడి పోయి అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చేర్పించారు. ఒక రోజు పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈనెల 17న సాయంత్రం 5:28 గంటలకు కాంతాబెన్ పటేల్ బ్రైయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు.
విషయాన్ని తెలుసుకున్న జీవన్ధాన సంస్థ ప్రతినిధులు కాంతాబెన్ కుటుంబసభ్యులను కలుసుకుని అవయవదానంపై అవగాహన కల్పించారు. బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలను దానం చేసినట్లయితే మరి కొందరికి జీవితాలను ప్రసాదించవచ్చునని జీవన్‌ధాన్ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మరణించిన తమ కుటుంబసభ్యుడి వలన మరి కొందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలుసుకున్న వారు బ్రైయిన్‌డెడ్ అయిన కాంతాబెన్ పటేల్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కాంతాబెన్కు చెందిన రెండు కిడ్నీలు, లివర్ దానం చేశారు.