మేడ్చల్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులు పెరిగిపోవడంతో బస్తీ, పల్లె దవాఖానల్లో ఓపీలు రెట్టింపు అయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్న రోగులు పల్లె, బస్తీ దవాఖానలకు క్యూ కడుతున్నారు. అయితే అక్కడ వారికి అరకొర వైద్యసేవలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పల్లె, బస్తీ దవాఖానలలో ఓపీలో 40 నుంచి 50 మంది వైద్య సేవలు పొందుతున్నట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు ఎం తగా ప్రబలుతున్నాయే అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో 520 డెంగీ కేసులు, 1,920 ఫీవర్ కేసులు నమోదైనట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది.
సీజనల్ వ్యాధులు ఇంతగా ప్రబలుతున్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉన్న క్రమంలో జిల్లాలో వైద్య సేవలు అంతగా అందడం లేదని ఆస్పత్రులకు వెళ్తున్న రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సి బ్బంది సమయపాలన పాటించకపోవడంతో గంటల తరబడి దవాఖానల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైద్యశాఖలో భారీగా ఖాళీలు..
వైద్యశాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానతో పాటు మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
12 ఆరోగ్య కేందాలు, 112 బస్తీ దవాఖానలు, 70 పల్లె దవాఖానలు ఉండగా 24 గంటలు విధులు నిర్వహించే 12 దవాఖానలు ఉన్నాయి. ఆయా దవాఖానలలో 35 వైద్యుల పోస్టులు, 27 మంది పారా మెడికల్, 32 ల్యాబ్ టెక్నీషియన్స్, 109 మంది సబ్ స్టాఫ్, 130 నర్సు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతోనే జిల్లా ప్రజలకు సరైన వైద్య సేవలు అందలేకపోతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ హయాంలో వెంటవెంటనే భర్తీ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బస్తీ, పల్లె దవాఖానలలో వైద్య సేవలు అందేలా పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించనా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాక మందులు కూడ పూర్తి స్థాయిలో ఉండటం లేదని వైద్య సేవల అనంతరం మళ్లీ వచ్చి మందులు తీసుకోవాలని సూచిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.