Hyderabad | అల్లాపూర్: రూ. 500 ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పరిశీలిస్తున్నారంటూ.. బస్తీవాసులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగడం లేదని, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు అవకతవకలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మంగళవారం అధికారులు అల్లాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ అల్లాపూర్‌లో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను పరిశీలించారు.
ఈ క్రమంలో దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగడం లేదని, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు అవకతవకలు చేస్తున్నారని బస్తీవాసులు ఆరోపిస్తూ…పెద్దఎత్తున రోడ్ల పైకి ఆందోళన చేశారు. రూ. 500 ఇచ్చిన వారి దరఖాస్తునే వరిశీలిస్తున్నారని, పైసలు ఇవ్వని వారికి సాకులు చెప్పి.. తరువాత వచ్చి పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో న్యూఅల్లాపూర్లో పర్యటించిన కార్పొరేటర్ సబీహాబేగంను కలిసిన బస్తీవాసులు.. తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఎలాగైనా న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహాబేగం మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అధికారులు పారదర్శకంగా నిర్వహించి అర్హులైన పేదలకే ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్ల కేటాయింపులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని నిరుపేదలకే ఇండ్లు దక్కేలా చూడాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి ..అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో బస్తీవాసులు నజీర్, శివరాజ్, మల్లికార్జున్, జాఫర్, బషీర్, అఫ్రాఫ్ పాల్గొన్నారు.