Online Betting | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో బెట్టింగ్ ఆటలు ఆడుతూ యువకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. యువతను ఆన్లైన్ గేమ్స్‌లోకి ఆకర్షించేందుకు బెట్టింగ్ మాఫియా సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రభావం ఉన్నా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా అలసత్వం వహిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ మన రాష్ట్రంలో ఉండకూడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. కేసులు నమోదు చేసింది. అయితే గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పరిస్థితి చిన్నా భిన్నంగా మారింది.
ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ పెరిగిపోయింది, ఆన్లైన్ గ్యాంబ్లర్స్‌పై పోలీసులు పట్టించుకోక పోవడంతో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించేందుకు ఇన్ప్లూయెన్సర్ను వాడుకోవడం మొదలు పెట్టారు. యాప్‌ల నుంచి వచ్చే ఆదాయం భారీగా ఉండటంతో ఇనుప్లూయెన్సర్స్ సైతం అమాయకులను బెట్టింగ్ రొంపిలోకి దింపుతూ కష్టాల్లో నెడుతూ, కొందరు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలకు పరోక్షంగా కారకులయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ప్లూయెన్సర్స్ కూడా దానిని ప్రమోట్ చేస్తుండటంతో వేలాది మంది యువత బెట్టింగ్ వైపు ఆకర్షితులయ్యారు. యువత తమ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్ల ఖాతాలకు తగేలేస్తున్నారు.
ఆటలను నిషేధిస్తూ చట్టం..
2017లో తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆటలను నిషేధిస్తూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.తెలంగాణ రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీ, తమళనాడు, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ పలు రాష్ర్టాల్లో ఆన్లైన్ బెట్టింగ్‌ను నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చారు. తెలంగాణలో ఈ యాప్‌లో ఇంటర్నెట్లో ఓపెన్ కాకూడదు. ఆయా రాష్ర్టాల సరిహద్దులను ప్రామాణికంగా చేసుకొని బెట్టింగ్ యాప్స్ ఓపెన్ కాకూడదు. ఓపెన్ అయ్యాయంటే పోలీసులు చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ నకిలీ జీపీఎస్‌లను ఉపయోగిస్తూ ఆయా వెబ్సైట్లు, యాప్‌లు నిషేధమున్న రాష్ర్టాలలోను ఓపెన్ అయ్యే విధంగా చేస్తున్నారు. దీంతో ఆయా బెట్టింగ్ రాయుళ్లు నిషేధమున్న రాష్ర్టాలలోను కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇందులో చాలా గేమ్స్‌కు చెందిన వెబ్సైట్లు, యాప్‌లు మన దేశ సరిహద్దు అవతలి నుంచే నిర్వహిస్తున్నారు.
బంపర్ ఆఫర్ అంటూ ..
ఆన్లైన్ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్సైట్లు ఇంటర్నెట్లో భారీ ప్రకటనలు ఇవ్వడం, ఇన్ప్లూయెన్సర్స్తో ఆయా గేమ్స్ గూర్చి చెప్పించడం చేస్తున్నారు. ఇలా ఆయా వెబ్సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫర్ ఇస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. వ్యసనంగా మారడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటల నుంచి బయటకు రాని పరిస్ధితిలో చాలా మంది ఉంటున్నారు. పది సార్లు పెట్టుబడి బడితే ఎనిమిది సార్లు నష్టపోవడం, రెండు సార్లు లాభం వచ్చినట్లు చూపించే లాజిక్స్‌ను బ్యాకెండ్ నుంచి గ్యాంబ్లింగ్ ఆట నిర్వాహకులు చేస్తుంటారు.
బీఆర్ఎస్ హయాంలో ముఠాల ఆటకట్టు
గత బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆటలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీయులు బ్యాకెండ్‌లో ఉండి కలర్ ప్రిడిక్షన్ పేరుతో ఒక ఆన్లైన్ గేమ్‌ను తయారు చేసి దేశ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలను లాగేశారు. ఈ గేమ్‌లో నష్టపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా స్పందించి ఆయా ముఠాల ఆటకట్టించింది.
కోట్లాది రూపాయల లావాదేవీలు..!
సోషల్‌మీడియాలో ఇన్ప్లూయెన్సర్స్ ప్రభావం నేడు సామాన్య ప్రజలపై చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారాభివృ ద్ధికి ఇన్ప్లూయెన్సర్తో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలు ఇస్తే తక్కువ మొత్తంలోనే ఆదాయం ఉంటుంది. అదే నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను మార్కెటింగ్ చేస్తే భారీగా ఆదాయం ఉంటుంది. పలువురు ఇన్ప్లూయెన్సర్స్ ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన లింక్‌లు తమ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తమ ఫాలోవర్స్‌కు చేరే విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు. లక్షల్లో వ్యూవర్స్ ఉంటున్నారు. అందులో 10 శాతం మంది అయినా ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో బెట్టింగ్ యాప్‌లకు భారీగానే ఆదాయం వస్తుంది. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ ఇస్తూ కొంత మంది సోషల్‌మీడియా ఇన్ప్లూయెన్సర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇన్ప్లూయెన్సర్స్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని, ముంబై ఢిల్లీ ప్రాంతాల నుంచి ఇన్ప్లూయెన్సర్స్ ఖాతాలలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులకు ప్రాథమికంగా తెలిసినా పట్టనట్లుగా ఇన్నాళ్లు వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఒక ఐపీఎస్ అధికారి దీనిపై స్పందించడంతో పోలీసులు కండ్లు తెరిచారనే టాక్ విన్పిస్తోంది.