మూసాపేట, జులై 18: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. రోడ్డు దాటుతున్న మహిళను క్రేన్ వెహికిల్ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందగా.. టవర్బూమ్పై నుంచి జారిపడి ఓ కార్మికుడు మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. మూసాపేటకు చెందిన దాసరి లావణ్య ప్రశాంత్ నగర్లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. గురువారం తెల్లవారుజామున డ్యూటీ కి వెళ్లే క్రమంలో మూసాపేట వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన క్రేన్ (TS 08F 3436) వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన లావణ్య.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని గోపరి గ్రామానికి చెందిన యువరాజ్ పటేల్ (22) కూకట్‌పల్లిలోని హానర్ హోమ్స్‌లో టవర్ బూమ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి మిషన్ ఆపరేట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 24వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో యువరాజ్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.