బంజారాహిల్స్,జూన్ 21: బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో ఆదివారం పార్కు చుట్టూ ట్రయల్ రన్‌గా వన్ వే విధానాన్ని అమలు చేశారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను కేబీఆర్ పార్క్ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ మీదుగా చెక్‌పోస్ట్ వైపు మళ్లించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే బంజారాహిల్స్ రోడ్ నెం 2ను వన్‌వేగా మార్చారు.
కాగా వెంకటగిరి వైపునుంచి ఫిలింనగర్ వెళ్లాల్సిన కొంతమంది వాహనాదారులు చెక్‌పోస్ట్ నుంచి నేరుగా వెళ్లేందుకు వీల్లేకపోవడంతో సుమారు 3కిలోమీటర్లు ఎక్కువ దూరం తిరిగి రావాల్సి వస్తోందంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా చెక్‌పోస్ట్ వైపు వెళ్లేవారు కిలోమీటర్ దూరానికి మూడున్నర కిలోమీటర్లు ఎందుకు తిరిగి రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ట్రయల్ రన్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.
కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ కాజల్, వెస్ట్‌జోన్ డీసీపీ రమణారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని హెచ్సిటీ ప్రాజెక్టు పనులు చేపట్టారని, నిర్మాణపనుల సందర్భంగా ట్రాఫిక్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగానే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు.కేబీఆర్ పార్కు పరిసరాల్లో 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్‌పాస్‌లు రానున్నాయని, కొన్నాళ్లపాటు ట్రాఫిక్ కష్టాలు అధిగమిస్తే ఈ ప్రాంతంలో సాఫీగా వాహనాలు దూసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు.