సిటీబ్యూరో: పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను అక్కున చేర్చుకుని పునర్జీవం ప్రసాదిస్తోంది నిమ్స్ హాస్పిటల్. కేసీఆర్ సర్కార్ 2022లో పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల ద్వారా లక్షల రూపాయల ఖరీదైన వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేడు ఎంతో మంది చిన్నారులకు నిమ్స్ పునర్జన్మ ప్రసాదిస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విభాగంలో కార్పొరేట్లలో సైతం కాదని చేతులెత్తేసిన క్లిష్టమైన కేసులను విజయవంతంగా చికిత్స చేయడంతో రోజురోజుకు ఈ విభాగానికి రోగుల తాకిడి పెరుగుతోంది. నిమ్స్‌లో జరుగుతున్న శస్తచ్రికిత్సల్లో 25శాతం కేసులు ఇతర రాష్ర్టాల నుంచే వస్తున్నట్లు కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్‌రావు తెలిపారు.
పుట్టుకతోనే వచ్చే గుండె వ్యాధులతో బాధపడే చిన్నారులను బతికించడానికి 2022లో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విభాగం అందుబాటులో లేకముందు ఏడాదికి కేవలం 40నుంచి 50 సర్జరీలు జరిగేవి. ప్రత్యేక విభాగం అందుబాటులోకి వచ్చిన తరువాత సంవత్సరానికి 300 నుంచి 350 వరకు క్లిష్టమైన గుండె సర్జరీలు చేస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప, కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్‌రావు తెలిపారు. ప్రతి నెల కనీసం 30 క్లిష్టమైన సర్జరీలు చేస్తున్నామని, గడిచిన మూడేండ్లలో ఇప్పటి వరకు సుమారు వెయ్యి గుండె శస్తచ్రికిత్సలను విజయవంతంగా జరిపినట్లు డాక్టర్ అమరేశ్‌రావు తెలిపారు.
నిమ్స్‌లో 1.1కిలో బరువున్న నవజాత శిశువులకు కూడా విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నాం. ఎక్కువగా పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉండడం, హార్ట్ డిజార్డర్, గుండెకు సంబంధించిన కనెక్షన్స్ సరిగ్గా లేకపోవడం, గుండె పనితీరు బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో చిన్నారులను తీసుకువస్తున్నారు. అత్యంత ఖరీదైన నైట్రిక్ ఆక్సైడ్, ఎక్మో, ఫొటో థెరపి, డయాలసిస్ తదితర వైద్య సదుపాయాలతో పాటు నిష్ణాతులైన వైద్యబృందం అందుబాటులో ఉండడంతో తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ర్టాల నుంచి ఈ మధ్య ఎక్కువ కేసులు వస్తున్నాయి.
అన్ని కేసులు క్రిటికల్ స్టేజీలోనే వస్తున్నాయి. ప్రతి నెలా 20 నుంచి 30 మంది చిన్నారులకు గుండె శస్తచ్రికిత్సలను విజయవంతంగా చేస్తున్నాం. చిన్నారుల గుండె మార్పిడి వంటి క్లిష్టమైన సర్జరీల కోసం యూఎస్, యూకె వైద్యనిపుణుల సహకారం కూడా తీసుకుంటున్నాం. నిమ్స్‌లో చిన్నారులకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర పథకాల కింద లక్షల రూపాయల ఖరీదైన, క్లిష్టమైన గుండె ఆపరేషన్లు పూర్తి ఉచితంగానే చేస్తున్నాం.
– డాక్టర్ అమరేష్‌రావు, కార్డియో థొరాసిక్ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్