ప్రజావాణి… ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమం. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీలో ప్రజా వేదన వినేవారే కరువయ్యారు. విన్నా పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహించడం… అసలు కార్యక్రమంలో ఎన్ని ఫిర్యాదులను స్వీకరించారు? ఎన్నింటికి పరిష్కారం చూపారన్న లెక్క పత్రం లేదు. కనీసం ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షలు జరిపిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రజావాణి నివేదికను వెల్లడించకపోవడం అధికారుల పనితీరుకు, పౌరుల సమస్యలపై జీహెచ్ఎంసీ యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
– సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
Praja Vani | ఇక గత ప్రజావాణి కంటే సోమవారం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం ఆంక్షల నడుమ సాగింది. అపరిష్కృత సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజావాణి వేదిక హాలులోకి వెళ్లాలంటే అర్జీదారుడు నిర్బంధాలను దాటి వెళ్లాలి. తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్, బ్యాగ్‌ను హోంగార్డు, సిబ్బందికి ఇస్తేనే వారి ఇచ్చిన టోకెన్ ద్వారా ప్రజావాణి హాలులోకి అనుమతి దక్కుతుంది. సమస్య తీవ్రత వివరించేందుకు సెల్‌ఫోన్‌ను అనుమతించాలని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అర్జీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆంక్షలు దాటుకుని ఒక నిమిషం ముందు ప్రజావాణి హాలులోకి వచ్చిన ఓ వృద్ధుడిని బలవంతంగా బయటకు పంపించడం శోచనీయం.
లంచం ఇవ్వలేను.. కాళ్ల మీద పడి వేడుకున్న శానిటేషన్ వర్కర్
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిపోయిందని, ట్రీట్మెంట్ తీసుకుని విధుల్లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ఏఎంవోహెచ్ రూ. 2 లక్షల లంచం అడుగుతున్నాడంటూ శానిటేషన్ వర్కర్ (శేరిలింగంపల్లి) మేయర్ కాళ్ల మీద పడి వేడుకున్నది. కుటుంబ పోషణ భారంగా మారిందని, శానిటేషన్ వర్కర్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని మేయర్‌కు విన్నవించింది. కానీ మేయర్ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోవడం గమనార్హం.
స్వీకరణ సరే.. పరిష్కారమైనవి ఎన్ని..
ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి నామమాత్రంగానే స్పందన లభించింది. ప్రధాన కార్యాలయంలో 35 ఫిర్యాదులు రాగా..అందులో అత్యధికంగా టౌన్‌ప్లానింగ్ 19, ఇతర విభాగాలకు విన్నపాలు వచ్చాయని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లలో మొత్తం 80 ఆర్జీలు వచ్చాయని, అందులో కూకట్పల్లి జోన్లో 42, శేరిలింగంపల్లి 13, సికింద్రాబాద్ జోన్ 9, ఎల్బీనగర్లో 11, చార్మినార్‌లో ఐదు ఫిర్యాదులు అందగా ఖైరతాబాద్ జోన్లో ఎలాంటి ఫిర్యాదు రాకపోవడం గమనార్హం. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా ఐదు విన్నపాలు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రజావాణికి పూర్తి సమయం కేటాయించని మేయర్
ప్రజావాణికి ఆయా విభాగాల హెచ్ఓడీలు విధిగా హాజరు కావాలని చెప్పిన మేయర్, ప్రజావాణి గడువు ముగియక (అరగంట)ముందే వెళ్లిపోయారు. అంతకు ముందు ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులను మేయర్ స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా సమస్యను పరిష్కరించి సంబంధిత అర్జీదారులకు తెలుపాలన్నారు. పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు తెలుపుతూ లిఖితపూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు శివకుమార్ నాయుడు, రఘు ప్రసాద్, నళిని పద్మావతి, సత్యనారాయణ, యాదగిరి రావు, గీత రాధిక, పంకజ, సరోజ, యూబీడీ డైరెక్టర్ శ్రీనివాస్, సీసీపీ కె. శ్రీనివాస్, అదనపు సీసీపీ గంగాధర్, ఏసీపీ సుదర్శన్, సీఈ భాస్కర్ రెడ్డి, జలమండలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.