సిటీబ్యూరో, జనవరి 4(నమస్తే తెలంగాణ): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకెళ్లే వారు తాము వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబసమేతంగా ఊళ్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని సీపీ పేర్కొన్నారు. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో కానీ, బీట్ ఆఫీసర్‌కు కానీ సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని, వాటిని బ్యాంక్ లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు. ఆధునిక పోలీసింగ్ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని, నేరాలను నియంత్రించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా భాగమేనని చెప్పారు. పండుగ సీజన్లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల ఇళ్ల భద్రతకు నగరపోలీస్శాఖ కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని సజ్జనార్ అభిప్రాయపడ్డారు.