Hyderabad | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య జరిగింది. సంతోష్ నగర్లో దేవరాజ్ అనే వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంతోష్‌నగర్‌లో నివసించే వృద్ధుడు దేవరాజ్‌కు కుటుంబసభ్యులు ఎవరూ లేరు. దీంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అదే కాలనీలో ఉంటున్న దేవా అనే యువకుడు అక్రమంగా చొరబడ్డారు. అనంతరం దేవరాజ్‌ను విచక్షణారహితంగా కొట్టి హత్య చేశాడు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న దేవాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.