Hyderabad Metro | చార్మినార్, జనవరి 30: పాత నగరవాసుల చిరకాల కల నెరవేరబోతుంది. నగర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన మెట్రో త్వరలో పాత నగరంలోనూ పరుగులు పెట్టబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసిన పాత నగరవాసులు మెట్రోలో ప్రయాణించే అవకాశం మరెంతో దూరంలో లేదు. అందుకు ఇప్పటికే పలుమార్లు మెట్రో అధికారులు పాత నగరంలో సర్వేలు చేపట్టి, భూసార పరీక్షలను సైతం పూర్తి చేశారు. పాత నగరంలో ఎంజీబీఎస్ నుంచి మొదలయ్యే మెట్రో చాంద్రాయణగుట్ట వరకు కొనసాగనుంది.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పాత నగరంలో మెట్రో 7.5 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. ఈ మార్గంలో ఇప్పటి వరకు 1100 ఆస్తులను పాక్షికంగాను, పూర్తిగాను తొలగించే అవకాశం ఉందని అధికారులు నిర్ధారించారు. ఇందులో ఇప్పటికే 270 మంది స్వచ్ఛందంగా తమ ఆస్తులను మెట్రో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. అలా ముందుకు వచ్చిన వారికి జిల్లా అధికార యంత్రాంగం గజానికి రూ.81 వేల నష్ట పరిహారాన్ని అందించేందుకు సిద్ధమైంది.
270 మంది ఆస్తులు అందించేందుకు ముందుకు రాగా, 170 మందికి రూ.80 కోట్ల చెక్కులను అందించిన అధికారులు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రోడ్డుకు సమీపంలో కొనసాగుతున్న ఆ భవనాలను అధికారులు కూల్చివేత పనులను వేగవంతం చేస్తున్నారు. మరో 3 నెలల నుంచి 4 నెలల కాలంలో మెట్రో రైల్ నిర్మాణం కోసం గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని పనులను మరింత వేగవంతం చేస్తామని మెట్రో రైల్ అధికారులు తెలిపారు.