Old City Metro | సిటీబ్యూరో: ఓల్డ్ సిటీ మెట్రోతో నగరంలో చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు వెళ్తున్న మార్గంలో రోడ్ల విస్తరణ, పిల్లర్లు వంటి నిర్మాణ కార్యకలాపాలతో దర్గాలు, కట్టడాలు, పురాతన భవనాలు కనుమరుగు కానున్నాయి. 7.5 కిలోమీటర్ల నిర్మాణంలో 100కుపైగా కట్టడాలు ఉన్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ గుర్తించింది. వీటికి నష్టం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పినా.. నిర్మాణాలకు రక్షణ ఉండదని పలువురు వాపోతున్నారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర ఆస్తుల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా తొలి దశలో 200 ఆస్తులకు సంబంధించి డిక్లరేషన్ తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల 1000కి పైగా ఆస్తులు నష్టపోతుండగా, ఇందులో మెజార్టీ నిర్మాణాలు చారిత్రక, మతపరమైనవేనని తేల్చారు. వీటిని సంరక్షించుకునేందుకు ఇప్పటికే మతపెద్దలు, ఆలయ నిర్వాహకులు, వారసత్వ, చారిత్రక నిర్మాణాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయి.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్గుట్ట వరకు ఇప్పటివరకు చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుతో కనుమరుగు కానున్న చారిత్రక, మతపరమైన కట్టడాలు, నిర్మాణాలు 100కు పైగా ఉన్నాయి. 21 మసీదులు, 12 దేవాలయాలు, 55 దర్గాలు, అషూర్ఖానాలతోపాటు, 13 శ్మశాన, చిల్లాలను ముందుగా హెచ్ఎంఆర్ఎల్ గుర్తించింది. నిర్మాణాలు, కట్టడాలు, భవనాలకు ఎలాంటి నష్టం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నా… ఆస్తులను సేకరిస్తే తప్ప.. పనులు చేయలేని పరిస్థితి ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలో భూ సేకరణ అనివార్యం కావడంతో… మరో దఫా అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. మతపరమైన, వారసత్వ కట్టడాలు, కుల, ఆలయ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఇక రోడ్డు విస్తరణ వల్ల రోడ్డుకు ఇరువైపులా 60 ఫీట్లకు పైగా కూల్చివేయనున్నారు. దీంతో కూడా మెజార్టీ కట్టడాలు నేలకూలే ప్రమాదం ఉందని, ఇక భారీ పిల్లర్ల నిర్మాణంతో భౌగోళికంగా కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని, పురాతన భవనాలకు కూడా ప్రమాదం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానమైన నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు మెట్రో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరుకైన మార్గాలు ఉండే ఈ ప్రాంతంలో మెట్రో స్టేషన్లకు భారీ స్థాయి భూములను సేకరించాల్సి ఉంటుంది. కనీసం 150-200 ఫీట్ల వెడల్పు ఉండే ప్రాంతంగా పక్కన ఉండే భవనాలు, కట్టడాలు కూల్చివేయాల్సి ఉంటుంది.