సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో పరిహారం చెల్లించిన తర్వాతే కూల్చివేతలు మొదలవుతాయని మెట్రో హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మార్గంలో భూసేకరణ పనులు ముమ్మరం చేశారు. ఏడున్నర కిలోమీటర్ల పొడువులో 1100 ప్రభావిత ఆస్తుల సేకరణకు కసరత్తు చేస్తుండగా, ఇప్పటివరకు 900 ఆస్తులకు సంబంధించిన రిక్వైజేషన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు. వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ను పలు దఫాలుగా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు.
నోటిఫై చేసిన 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ పూర్తి చేయగా, 200 ప్రభావిత ఆస్తుల పరిహారానికి సంబంధించిన ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. పరిహారం చెల్లించిన వెంటనే కూల్చివేతులు మొదలవుతాయన్నారు. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యజమానులతో చర్చించి, భూ సేకరణ చట్టం ప్రకారం సేకరించి, రోడ్డు విస్తరణ పనులు చేపడుతామన్నారు. చారిత్రక, మతపరమైన కట్టడాలను పరిరక్షించేలా ఇంజినీరింగ్ సొలుష్యన్లు అమలు చేశామన్నారు. మెట్రో రైల్ రాకతో ఓల్డ్ సిటీ రూపురేకలు మారిపోతాయని, పనుల పురోగతిని సీఎం రేవంత్రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, భూ సేకరణ ప్రక్రియపై ఇటీవలే సమీక్షించినట్లు ఆయన తెలిపారు.