సిటీబ్యూరో, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా చిక్కులు తొలగలేదు. పాత నగరానికి మెట్రో నిర్మాణంతో మంచి రోజులు వస్తాయంటూ ఇచ్చిన హామీలన్నీ భూసేకరణ వద్దనే నిలిచిపోతున్నాయి. రెండున్నర కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని పొడిగించామని చెప్పుకుంటున్నా… క్షేత్రస్థాయిలో మాత్రం రెండు అడుగుల భూసేకరణకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చారిత్రక, వారసత్వ, మతపరమైన నిర్మాణాల విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోలేక, భూసేకరణ చేయడమే అధికారులకు గగనంగా మారింది. దీంతో ప్రాజెక్టుకు భూములు ఇస్తే గానీ మెట్రో నిర్మాణం కొలిక్కి వచ్చేలా లేదు.
తొలి దశలోనే పూర్తి కావాల్సిన ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. రెండో దశలో రెండున్నర కిలోమీటర్లు పొడిగించి ప్రాజెక్టు పనులు చేపట్టినా… క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. మూడు నెలల్లో భూసేకరణ పూర్తి చేసి, నిర్మాణాల తొలగించిన వెంటనే నిర్మాణానికి చర్యలు చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నా… నిత్యం ఎదురవుతున్న అవాంతరాలు ప్రాజెక్టును నిలవరిస్తున్నాయి.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్గుట్ట వరకు పొడిగించిన ఈ మార్గంలో దాదాపు 900 ఆస్తులను సేకరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఏడున్నర కిలోమీటర్ల మేర నిర్మించే ఎంజీబీఎస్-చాంద్రాయణ్గుట్ట వరకు మెట్రో విస్తరణను రూ. 2741 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఫేస్-2 విస్తరణలో భాగంగా దాదాపు 1000కిపైగా ఆస్తులు ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. ఇందులో మెట్రోకు అంగీకారం తెలిపిన వారి సంఖ్య వంద లోపే ఉంది. భూ యాజమాన్య హక్కుల పరిశీలన తర్వాత కొంత మందికి చెక్కులను పంపిణీ చేశారు. మిగిలిన వారు కూడా త్వరగా ముందుకొస్తే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది.