రంగారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మరో భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలెట్టారు. శంషాబాద్ కేంద్రంగా అమరావతి, చెన్నై, బెంగళూరుకు నడపనున్న బుల్లెట్ ట్రైన్ల కోసం అధికారులు సర్వే చేస్తుండడంతో జిల్లా రైతుల్లో మరోసారి గుబులు పట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రకటించిన బులెట్ ట్రైన్ల కారిడార్‌ను జిల్లాలోని శంషాబాద్ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో భూములను సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఫ్యూచర్‌సిటీ, పారిశ్రామిక పార్కు లు, ఫార్మాసిటీ వంటి ప్రజాఅవసరాల పేరుతో పెద్ద ఎత్తున భూములను సేకరించారు.
తాజాగా, బులెట్ ట్రైన్ల మార్గం కోసం ఇప్పటికే అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు. కాగా, ఈ సర్వే పనులను రైడ్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించగా భూసార పరీక్షల ఆధారంగా సురక్షిత మార్గాన్ని ఎంపిక చేసి దానికనుగుణంగా మార్కింగ్ చేస్తున్నారు. భా రత్ ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి, చెన్నై మార్గంలో నడపనున్న బుల్లెట్‌ట్రైన్ యాచారం మండలంలోని నందివనప ర్తి, చింతపట్ల, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మాల్, తమ్మలోనిగూడ, మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, కుర్మిద్ద, మేడిపల్లి తదితర గ్రామాల నుంచి నల్గొండ జిల్లాలోని మ ర్రిగూడకు వెళ్లనున్నది. అలాగే శంషాబా ద్ నుంచి బెంగళూరు వెళ్లనున్న బుల్లెట్‌ట్రైన్ శంషాబాద్, షాబాద్ మండలాల్లో ని పలు ప్రాంతాల నుంచి వెళ్లనుండడం తో ఆయా ప్రాంతాల్లో భూముల్లో సర్వే నిర్వహిస్తూ హద్దులను గుర్తిస్తున్నారు.
పలుచోట్ల హద్దుల ఏర్పాటు..
బుల్లెట్ ట్రైన్ల మార్గం కోసం సేకరించే భూములకోసం అధికారులు పలుచోట్ల హద్దులను ఏర్పా టు చేస్తున్నారు. వ్యవసాయ భూముల కోసం ఎరుపురంగు, ఇతర అవసరాల భూముల కోసం తెలుపురంగు మార్కులు వేస్తున్నారు. రైడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సర్వే పను లు రాత్రీ పగలు నిరాటకంగా సాగుతున్నాయి. అధికారులు సర్వే ఎందుకు చేస్తున్నారో తెలియక ఆయా గ్రామాల ప్రజలు అయోమయానికి గురవుతున్నా రు. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తుండటంతో ఆయా గ్రామాల రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది.
భూములు కోల్పోనున్న మండలాలివే..
శంషాబాద్ కేంద్రంగా నడపనున్న బుల్లెట్ట్రైన్ల కోసం శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం, షాబాద్, కొందుర్గు వంటి మండలాల్లో ప్రభావం ఉండనునది. ఈ మండలాల్లో ఇప్పటికే అధికారులు ఏరియల్ సర్వే పూర్తి కాగా, క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత తుది అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. ఇప్పటికే యాచా రం మండలంలోని చింతపట్ల, తక్కళ్లపల్లి, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లో సర్వే నిర్వహించి తెలుపు, ఎరుపు రంగులను ఆయా పాయింట్ల వద్ద ఏర్పాటు చేశారు.
ఉక్కిరి బిక్కిరవుతున్న జిల్లా రైతాంగం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున భూసేకరణ కార్యక్రమాలు చేపడుతున్నది. ఫ్యూచర్‌సిటీ పేరుతో ఇప్పటికే ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలను తీసుకోవటంతోపాటు మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టిం ది. ప్రభుత్వం చేపట్టే భూసేకరణకు జిల్లా రైతులు అడుగడుగునా అడ్డు తగులుతున్నా పోలీసుల సహకారంతో భూములను సేకరిస్తున్నది. బాధిత రైతులకు పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ చేస్తున్నది.
తాజాగా జిల్లాలోని పలు మండలాల్లో బుల్లెట్ట్రైన్ల కోసం భూసేకరణకు తెరలేపింది. శంషాబాద్ కేంద్రంగా చెన్నై, అమరావతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు నడపనున్న బుల్లెట్ట్రైన్లకోసం అవసరమయ్యే భూములకోసం ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు. తాజాగా క్షేత్రస్థాయి సర్వే కూడా నిర్వహిస్తుండటంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను ఎక్కడ లాక్కుంటారోనని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న బూసేకరణతో జిల్లా రైతులకు కంటిపై కునుకు లేకుండా పోతున్నది.