సిటీ బ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియ గందరగోళంగా మారుతున్నది. అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎన్యుమారేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. కానీ ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో కనీసం 50 శాతం కూడా పంపిణీ పూర్తి కాలేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
బీఎల్వోలు మాత్రం తమకు కేటాయించిన బూత్‌లకు సంబంధించిన ఫారాలను తమ దగ్గరే ఉంచుకుని.. అన్నీ పంపిణీ చేసినట్లు యాప్‌లో నమోదు చేస్తున్నారు దీంతో 100 శాతం పూర్తయినట్లు చూపుతున్నారు. ప్రతి ఓటరు ఇంటికి కనీసం ముడు సార్లు వెళ్లాలనే నిబంధనను తుంగలో తొక్కుతూ తమ ఇండ్ల వద్దకే ఓటర్లు రావాలని ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడువు పూర్తవుతుందనే నెపంతో ముందుగానే ఎన్యుమారేషన్ ఫారాలను స్కాన్ చేసి ఆన్లైన్లో పంపిణీ పూర్తయినట్లు చూపుతున్నారు.
దీంతో ఎన్నికల కమిషన్ కనీసం ఎక్కడా తనిఖీలు చేయకుండా బీఎల్వోలు ఆన్లైన్లో నమోదు చేసిన ప్రకారమే లెక్కలు చేసి అధికారికంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమకు ఫారాలు అందకుండానే పంపిణీ పూర్తయిందని ఎన్నికల కమిషన్ చెప్తుండంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఫారాలు రాలేదంటేఏ ఓటు పోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు? పంపిణీ పారదర్శకంగానే చేస్తున్నారా? ఓటర్లను కలుస్తున్నారా? లేదా? ఎన్నికల అధికారులు తనిఖీ చేయాలని కోరుతున్నారు. ఓటర్లందరికీ సకాలంలో ఎన్యుమారేషన్ ఫారాలు అందజేసి నమోదు ప్రక్రియ పూర్తిచేసేలా పర్యవేక్షించాలని ఓటర్లు కోరుతున్నారు.
అయోమయంలో ఓటర్లు
సర్ ప్రక్రియ గడువు పూర్తయి, మళ్లీ పొడిగించినా ఇంకా కొంతమంది ఓటర్లకు ఈ ప్రక్రియపై అవగాహన కరవడింది. ఇప్పటికీ తమ ఎన్యుమారేషన్ ఫారాలు తీసుకోలేదు. మరికొంత మందికి ఫారాలు ఎలా నింపాలో తెలియకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. బీఎల్వోలు ఇంటికి వచ్చి తీసుకెళతారేమోనని నింపిన పత్రాలను తమ వద్దే ఉంచుకుంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు వెలవెలబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న హెల్ప్ డెస్క్‌లకు ఓటర్లు క్యూ కడుతున్నారు. చాలా చోట్ల బీఎల్‌వోలకే అవగాహన లేకపోవడంతో ఓటర్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బీఎల్వోలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు.
డిజిటలైజేషన్ వెరీ స్లో
గ్రేటర్ వ్యాప్తంగా ఎన్యుమారేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయినట్లు చూపుతున్నారు. కానీ డిజిటలీకరణ మాత్రం అందుకు తగ్గట్లుగా జరగటం లేదు. 50 శాతం కూడా దాటడం లేదు. గురువారం నాటికి హైదరాబాద్‌లో డిజిటలైజేషన్ 31.5 శాతం, రంగారెడ్డి జిల్లాలో 41.4 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 28.41 శాతంగా ఉన్నది. వంద శాతం పంపిణీ పూర్తయితే కనీసం యాభై శాతం కూడా డిజిటలైజేషన్ చేయకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల దగ్గరకు వెళ్లిన పత్రాల్లో కనీసం సగ వరకైనా ఇప్పటిదాకా బీఎల్వోలకు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లకు సహకరించేందుకు బీఎల్ఏలను ఏర్పాటు చేసుకున్నారు. వివరాలు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఏలకు చేరవేడంలో సహకరిస్తున్నారు. అలాంటప్పుడు వంద శాతం పంపిణీ పూర్తయితే డిజిటలైజేషన్ చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.