హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ (Himayat sagar), ఉస్మాన్ సాగర్‌లోకి (Usman Sagar) ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. జంట జలాశయాల్లోకి భారీగా వరద (Floods) వస్తుండటంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు.. నేడు మరో గేట్లను తెరవనున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌లోకి 1600 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో రెండు గేట్లను ఎత్తివేయడంతో 2750 క్యూసెక్కుల నీరు మూసీలోకి (Moosi) వెళ్తున్నది. ప్రస్తుతం 1,763.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగుల వద్ద ఉన్నది.
ఇక ఉస్మాన్‌సాగర్‌కు 800 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. దీంతో సాగర్ నీటిమట్టం 1785.65 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.
కాగా, జంటనగరాల్లో భారీ వర్షాలతో బంజారా, పికెట్, కూకట్పల్లి నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ట్యాంక్‌బండ్‌కు (Tank bund) 40 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. దీంతో హుస్సెన్ సాగర్ (Hussain Sagar) పూర్తిస్థాయిలో నిండటంతో తూమ్‌ల నుంచి పెద్దఎత్తున నీరు మూసీలోకి వెళ్తున్నది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు, ప్రస్తుతం 513.62 మీటర్ల వద్ద ఉన్నది. దీంతో అధికారులు తూముల ద్వారా 5800 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌తోపాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తం చేశారు.