బంజారాహిల్స్, జనవరి 21: నగరం నడిబొడ్డున రూ.300 కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కులో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల వ్యవహారంలో యూబీడీ విభాగం అధికారులు ఇప్పటికీ నిద్రమత్తు వీడడం లేదు. పార్కును స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ రోడ్ నం. 32లోని జీహెచ్ఎంసీ పార్కును అభివృద్ధి చేస్తున్నామంటూ సొంత ఆస్తిలా వాడుకున్న వైనంపై పదిరోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ కథనం తీవ్ర కలకలం రేపింది. పార్కులో ఆక్రమణల వెనుక ఎవరున్నారనే విషయంపై ఏకంగా నిఘా సంస్థలు విచారణ చేపట్టి మున్సిపల్ శాఖను చూసే సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందించాయి. దీంతో ఎట్టకేలకు ఐదురోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా మూడున్నర ఎకరాల పార్కులో వెలిసిన నిర్మాణాలను పరిశీలించారు.
జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉండాల్సిన పార్కు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడమేంటని హైడ్రా కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే నిర్మాణాలు, పార్కులో నిర్మించిన, గదులు కూల్చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ విభాగం ఆధ్వర్యంలో ఆక్రమణలను కొంతమేర తొలగించారు. ఇంత జరుగుతున్నా పార్కుల నిర్వహణను చూడాల్సిన జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
‘నమస్తే’లో కథనం వచ్చిన రోజున పార్కును సందర్శించిన యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, జూబ్లీహిల్స్ సర్కిల్ యూబీడీ విభాగం మేనేజర్ జ్యోత్స్న తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు వ్యక్తులు పార్కును సొంత ఆస్తిలా మార్చుకుని నాలుగైదు చోట్ల గేట్లను ఏర్పాటు చేసుకున్నారని గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పదిరోజుల కిందట రూ.300కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కు స్థలంలో ఆక్రమణల విషయం బయటకు వచ్చినా బల్దియా కమిషనర్ కర్ణన్ గానీ, యూబీడీ, టౌన్‌ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు పార్కును పరిశీలించకపోవడాన్ని చూస్తుంటే పార్కు అభివృద్ధి పేరుతో నిర్మాణాలు చేసిన వారికి పెద్దవారి అండదండలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
భారీ బండరాళ్లు, అరుదైన వృక్షాలు, వివిద రకాలైన మొక్కలు, గుబురైన పొదలతో ఉన్న ఈ పార్కు నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన యూబీడీ విభాగం ఆ పని చేయకపోవడంతోనే ప్రైవేటు వ్యక్తులు పార్కులో నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో హైడ్రా రంగంలోకి దిగిన తర్వాతనైనా పార్కు నిర్వహణపై స్థానిక యూబీడీ విభాగం అధికారులు దృష్టి పెడతారని ఆశించినా ఫలితం దక్కలేదు. ఖరీదైన పార్కు స్థలంతో తమకు ఏం సంబంధం లేనట్లు యూబీడీ విభాగం అధికారులు వ్యవహరిస్తుండడంతో మరోసారి ఈ పార్కును సొంతం చేసుకునేందుకు బడాబాబులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పందించి పార్కు నిర్వహణను గాడిలో పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.