సిటీబ్యూరో: వర్షాకాలం ముగిసే వరకు నగరంలో ఎలాంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో వర్షపు నీరు నిలవకుండా బిల్డర్లు, డెవలపర్లు సొంత ఖర్చులతో మోటర్లు పెట్టి తోడేయాల్సి ఉంటుంది. ఆ నీటిని రోడ్లపైకి వదిలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటివరకు తవ్విన చోట్ల భూమి కుంగిపోకుండా మట్టిని బలపరచడం రక్షణ గోడల నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు తక్షణమే చేపట్టాలి.
కాగా, నోటీసులు ఇచ్చినా స్పందించని బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు, సదరు బిల్డర్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. అనుమతి లేకుండా తవ్విన లేదా పనులు నిలిపివేసిన సెల్లార్లను సీ అండ్ డీ వేస్ట్ విభాగాన్ని సమన్వయం చేసుకొని తక్షణమే మట్టి, కూల్చివేత వ్యర్థాలతో పూడ్చివేయాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్లో ప్రతి సరిల్లో బలహీనంగా ఉన్న కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంజినీరింగ్ విభాగంతో కలిసి సర్వే నిర్వహించనున్నారు. గుర్తించిన పాత భవనాల పటిష్టతపై ఇంజినీరింగ్ విభాగానికి పంపి నివేదిక తీసుకోవాలి. అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల నుంచి నివాసితులను తక్షణమే ఖాళీ చేయించి, వాటిని సీల్ చేస్తారు.