సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మలక్‌పేట, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బుల్డోజర్ వచ్చిందంటే చాలు.. మూసీ పరీవాహక ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏ క్షణాన ఎక్కడ కూల్చివేతలు మొదలవుతాయోనని ఆందోళన పడుతున్నారు. బుధవారం ఉదయం చాదర్‌ఘాట్ పరిధిలో జేసీబీతో కూల్చివేతలు చేపట్టడంతో ఇతర ప్రాంతాల్లోని కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారులు సైతం వీటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అసలు ఏం జరుగుతుందోనని అందరినీ వాకబు చేస్తున్నారు. అయితే గతంలో చేపట్టిన కూల్చివేతలకు సంబంధించి ఇంకా మొండి గోడలు ఉండటంతో బాధితులు తిరిగి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారనే అనుమానంతో ఈ కూల్చివేతలు చేపట్టారని కొందరు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. దీంతో కూల్చివేతలు మొండి గోడలకే పరిమితం అవుతాయా? అది పూర్తయిన కొత్త నిర్మాణాల వైపునకు వస్తాయా అనే దానిపై అధికారులు పెదవి విప్పడం లేదు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంటేనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పరీవాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ప్రాజెక్టులో భాగంగా గతంలో భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టేందుకు సర్వే చేసి, మూసీ రివర్ బెడ్ పరిధిలో 2,166 నిర్మాణాలు, బఫర్‌జోన్‌లో 7,851 నిర్మాణాలతో పాటు 200 వరకు ఓపెన్ స్పేస్ ఉన్నాయని తేల్చారు. ఆ మేరకు చాదర్‌ఘాట్ పరిధిలోని మూసానగర్, ఓల్డ్ మలక్‌పేట పరిధి శంకర్‌నగర్ పరిధిలో సుమారు 150 వరకు కుటుంబాలు నివాసముంటున్న ఇండ్లను కూల్చివేశారు. అంబేద్కర్ హట్స్, సాయిలు హట్స్, అజయ్ హట్స్ ప్రాంతాల్లో 109 వరకు గుడిసెలను గుర్తించారు.
వీటిల్లో 26 వరకు గుడిసెల్ని కూల్చివేశారు. ఆ సందర్భంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా కూల్చివేతల్ని వ్యతిరేకించి.. బాధితులకు అండగా నిలిచింది. దీంతో ప్రభుత్వం కూల్చివేతల ప్రక్రియను నిలిపివేసింది. బాధితులకు చంచల్‌గూడ పిల్లి గుడిసెలు, వనస్థలిపురం, ప్రతాపసింగారం, ఇజయాగూడ ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కూల్చివేతలు నిలిచిపోయాయని పరీవాహక ప్రాంత ప్రజలు కాస్త కుదుటపడ్డా… ఏక్షణాన బుల్డోజర్లు వస్తాయోనన్న భయం మాత్రం ఉంది.
చాదర్‌ఘాట్ పరిధిలోని మూసానగర్లోకి అధికారులు బుధవారం జేసీబీ సహా వచ్చి కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో మళ్లీ మూసీ పరీవాహకంలో కూల్చివేతలు మొదలయ్యాయంటూ మీడియా, సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరిగింది. దీంతో పరీవాహక ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాలామంది తమ పనులు వదులుకొని ఇండ్ల వద్దకు వచ్చారు. మూసానగర్‌లో గతంలో కొంతమేర కూల్చివేయగా మిగిలిన మొండి గోడలు, శిథిలమైన నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసే పనులు మొదలుపెట్టారు.
అయితే కొంతసేపటికి జేసీబీలో సాంకేతిక సమస్యతో పనులు నిలిపివేశారు. అయినప్పటికీ కూల్చివేతలను ఇంకా కొనసాగిస్తారా? గతంలో కూల్చివేసిన వాటికే పరిమితం చేస్తారా? అనే దానిపై అటు రెవెన్యూ ఇటు ఎంఆర్డీసీఎల్ అధికారులు నోరు విప్పడం లేదు. కాగా దీనిపై ‘నమస్తే తెలంగాణ’ మలక్‌పేట ఎమ్మెల్యే బలాలను సంప్రదించగా.. గతంలో అసంపూర్తిగా కూల్చివేసిన వాటిని పూర్తిగా తొలగించి, శిథిలాలను అక్కడి నుంచి తొలగించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు చెబుతున్నారు.
తదుపరి ఆక్రమణలకు గురికాకుండా ఉండటంతో పాటు ఇతర కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్డీసీఎల్ అధికారులను తాను కోరానని ఈ క్రమంలో రూ.3.60 కోట్లతో ఈ పనులు పూర్తి చేయడంతో పాటు అడ్డుగా గోడ కట్టనున్నట్లు చెప్పారు. మరి మరోవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరీకరణపై తాము ముందుకే వెళతామని అనేకసార్లు ప్రకటించింది. ఇందులో భాగంగా బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను కూడా తొలగిస్తామని అంటున్నది. ఎమ్మెల్యే బలాల చెబుతున్నట్లు రివర్ బెడ్ వరకు అడ్డుగా గోడ కడితే తదుపరి బఫర్‌జోన్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.