బేగంపేట, మార్చి 10: నిరుపేదలైన ఫుట్ పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం అధికారులు మానుకోవాలని, లేకుంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సోమవారం రాంగోపాల్‌పేట, నల్లగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఫుట్‌పాత్ వ్యాపారులు, బల్దియాకు చెందిన షాపులలో అద్దెపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లి లోని కార్యాలయంలో కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు అద్దెలు పెంచుతామని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో మోండా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు ఉన్నారు.